కంబళ క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చండి.. లేదంటే శ్రీనివాస గౌడ్‌కు..
By అంజి Published on 15 Feb 2020 1:38 PM ISTకర్నాటక: బురద మళ్లలో ఒలిపింక్స్ పతాక విజేత, పరుగుల వీరుడు ఉసెన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తిన శ్రీనివాస గౌడకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రికి రాత్రే సూపర్‌స్టార్ అయిన శ్రీనివాస గౌడపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. అతివేగంతో పరిగెత్తి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీనివాస్ గౌడ గురించి ట్విటర్ వేదికగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దృష్టికి తీసుకువెళ్లారు. అతడి శరీర దారుడ్యాన్ని చూడండని, అథ్లెటిక్స్‌లో విజయం సాధించే సామర్థ్యం అతడికి ఉందన్నారు. 100 మీటర్ల పరుగులో శిక్షణ ఇవ్వాలని లేదా కంబళ క్రీడను ఒలింపిక్‌లో చేర్చేలా ప్రయత్నాలు చేయాలని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అలాగే బంగారు పతకం కూడా ఇవ్వాలన్నారు. అతడికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ పంపాలని పలువురు సూచిస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. శాయ్‌కి పిలిపిస్తామన్నారు. అయితే చాలా మందికి అథ్లెటిక్స్‌కు సంబంధించి, ఒలింపిక్స్ ప్రమాణాలపై అవగాహన ఉండదని ఆయన అన్నారు. ట్రయల్స్ కోసం శ్రీనివాస గౌడను శాయ్ కోచ్‌ల వద్దకు పిలిపిస్తామని కిరణ్ రిజిజు అన్నారు. అయితే దేశంలో ప్రతిభ కలిగిన వ్యక్తులను ఎప్పటికీ వదులుకోబోం అంటూ ట్వీట్ చేశారు.
దేశ వ్యాప్తంగా శ్రీనివాస గౌడపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి స్పందించారు. ఇలాంటి వ్యక్తులు మరింత మంది కావాలని అన్నారు.
కంబళ పోటీల్లో శ్రీనివాస గౌడ (28) ముప్పయ్ ఏళ్ల రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన గౌడ.. 142.50 దూరాన్ని కేవలం 13.62 సెకండ్లలో పరిగెత్తాడు. ఈ లెక్కన అతడు 100మీట్లర పరుగును కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేశాడు.
వంద మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరిట ఉంది. 2009లో బెర్లిన్‌లో బోల్ట్.. 100మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తిచేసి రికార్డు నెలకొల్పాడు. ఈ లెక్కన చూస్తే బోల్ట్ కంటే శ్రీనివాసగౌడనే తక్కువ సమయంలో పరిగెత్తాడు. దీంతో శ్రీనివాస గౌడ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రభుత్వం అతన్ని ఒలింపిక్స్‌కు తయారు చేయించాలని కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అయితే, వేగంగా పరుగెత్తే దున్నల వల్లనే శ్రీనివాస గౌడ పరుగు ముడిపడి ఉందన్న విషయం మీరు ఇక్కడ గమనించాలి.