ఇంకా తెరచుకోని శ్రీ కాళహస్తి ఆలయం.. ఎందుకంటే.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jun 2020 11:02 AM GMT
ఇంకా తెరచుకోని శ్రీ కాళహస్తి ఆలయం.. ఎందుకంటే.?

జూన్ 10వ తేదీ నుంచి దేశంలోని ప్రార్థనా మందిరాలు, దేవాలయాలను తెరచి.. భక్తులకు భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పించవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. దీంతో దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలను శానిటైజ్ చేసి, భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామి, అమ్మవార్ల దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశాయి. దీంతో బుధవారం ఉదయం 6 గంటల నుంచే వివిధ ఆలయాల్లో దర్శనాలు మొదలయ్యాయి. కానీ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళ హస్తీశ్వరాలయం మాత్రం ఇంకా తెరచుకోలేదు.

మార్చి 23వ తేదీన మొదలైన లాక్ డౌన్ తో మూతపడిన దేవాలయాల్లోకి భక్తులకు అనుమతి లేదు గానీ.. స్వామి వార్లకు పూజా కైంకర్యాలు మాత్రం యథావిధిగానే జరిగాయి. అలాగే శ్రీ కాళ హస్తీశ్వరాలయంలో కూడా నిత్య పూజలు జరిగాయి. కాగా.. ఇటీవలే ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడైంది. ఈ కారణం చేతనే ఆలయాన్ని తెరువలేదు. ఆలయంలో అతనితో పాటు పనిచేసిన వారందరికీ కూడా ప్రస్తుతం కరోనా నిర్థారణ పనులు చేస్తున్నారు. అలాగే ఆలయం మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు. సదరు అర్చకుడికి రెండు ప్రాంతాల్లో ఇళ్లు ఉండగా.. ఆ రెండు ఏరియాలను కంటైన్మెంట్ క్లస్టర్ గా ప్రకటించారు అధికారులు.

అన్ లాక్ 1 నిబంధనల అమలు తర్వాత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరింత పెరిగిపోయాయి. రోజుకు కొత్తగా 10000 కేసులు వస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం ఇది ఇలాగే కొనసాగితే జులై నెలాఖరు కల్లా ఒక్క ఢిల్లీలోనే ఐదున్నర లక్షల కేసులు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులోనూ.. రానున్నది వర్షాకాలం కావడంతో నిపుణులు, అధికారులు ఆందోళన పడుతున్నారు. కేసులు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వాల ఆదాయాల కోసం అన్నింటినీ తెరుచుకుంటూ పోతే.. మన దేశం మరో అమెరికా అవుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Next Story
Share it