6,6,6,6,4,6.. యువీ రికార్డును కొద్దిలో మిస్ అయిన జింబాబ్వే బ్యాట‌ర్‌

Zimbabwe's Ryan Burl smashes 34 runs in an over against Bangladesh in T20I.భార‌త మాజీ ఆటగాడు యువ‌రాజ్ సింగ్ 2007 టీ20

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2022 5:39 AM GMT
6,6,6,6,4,6.. యువీ రికార్డును కొద్దిలో మిస్ అయిన జింబాబ్వే బ్యాట‌ర్‌

భార‌త మాజీ ఆటగాడు యువ‌రాజ్ సింగ్ 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్ బౌల‌ర్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు కొట్ట‌డం ఎవ్వ‌రూ అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేదు. అయితే.. ఓ జింబాబ్వే బ్యాట‌ర్‌ కొద్దిలో ఈ రికార్డును మిస్ అయ్యాడు. ఒకే ఓవ‌ర్‌లో 6,6,6,6,4,6 బాదాడు. దీంతో ఒకే ఓవ‌ర్‌లో 34 ప‌రుగులు సాధించాడు.

వివ‌రాల్లోకి వెళితే.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖ‌రి టీ20లో జింబాబ్వే, బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవ‌ర్లో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓ ద‌శ‌లో 67 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టును ర్యాన్ బ‌ర్ల్ (54; 28 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), న్యూచీ (35) ఆదుకున్నారు. ర్యాన్ బ‌ర్ల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్ వేసిన న‌సుమ్ అహ్మ‌ద్‌కు చుక్క‌లు చూపించాడు.

తొలి నాలుగు బంతుల‌ను సిక్స్‌లుగా మ‌లిచాడు. దీంతో త‌రువాత బంతికి ఏమ‌వుతుందా..? మ‌రోసారి 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు చూసే అవ‌కాశం వ‌స్తుందా..? అనే ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. అయితే.. ఆ త‌రువాత రెండు బంతుల్లో ఫోర్‌, సిక్స్ బాదాడు. ఆరు బంతుల్లో 6 సిక్స‌ర్లు కొట్ట‌లేక‌పోయిన‌ప్ప‌టికీ ఒకే ఓవ‌ర్‌లో 34 ప‌రుగులు సాధించిన వారి జాబితాలో మాత్రం చోటు ద‌క్కించుకున్నాడు.

అనంత‌రం ల‌క్ష్య‌చేధ‌న‌లో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 కే ప‌రిమిత‌మైంది. దీంతో జింబాబ్వే 10 ప‌రుగుల తేడాతో మ్యాచ్ గెల‌వ‌డంతో పాటు టీ20 సిరీస్‌ను 2-1తో కైవ‌సం చేసుకుంది. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిసిన ర్యాన్‌ బర్ల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సొంతం చేసుకోగా.. సికందర్‌ రాజాకు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు ద‌క్కింది.


Next Story