మరో సంచలనం.. పాక్‌కు జింబాబ్వే షాక్
Zimbabwe shocked Pakistan with 1-run win in T20 world cup match.ఒక్క పరుగు తేడాతో పాక్‌పై జింబాబ్వే విజయం సాధించింది
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2022 8:17 AM ISTఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. టైటిల్ ఫేవరెట్లుగా బావిస్తున్న జట్లకు చిన్న జట్లు షాకిస్తున్నాయి. ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్ షాకివ్వగా.. తాజాగా పాకిస్తాన్‌కు జింబాబ్వే ఝలక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో పాక్‌పై జింబాబ్వే విజయం సాధించింది.
గ్రూప్-2లో భాగంగా పెర్త్ వేదికగా గురువారం పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఓ దశలో 13.4 ఓవర్లకు 95/3 స్కోరుతో నిలిచిన జింబాబ్వే.. 150కి పైగా పరుగులు సాధిస్తుందని అనిపించింది. అయితే.. ఆరు బంతుల్లో అంతా తారుమారైంది. పాక్ బౌలర్ల దెబ్బకు నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే.. ఆఖర్లో కోలుకుని పోరాడే స్కోర్ సాధించింది. జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీమ్ నాలుగు, షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఓ మోస్తారు లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రిజ్వాన్(14), కెప్టెన్ బాబర్ అజామ్(4) లతో పాటు ఇఫ్తాకార్ అహ్మద్(5)లు దారుణంగా విఫలం అయ్యారు. టీమ్‌ఇండియాతో మ్యాచ్‌లో రాణించిన షాన్ మసూద్ (44) ఒక్కడే పోరాడాడు. షాదాబ్ ఖాన్ (17), హైదర్ అలీ (0) లు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.
పాక్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం అయ్యాయి. తొలి బంతికి మూడు పరుగులు రాగా రెండో బంతిని వసీమ్ (12 నాటౌట్) బౌండరీకి తరలించాడు. దీంతో విజయ సమీకరణం 4 బంతుల్లో 4 పరుగులుగా మారింది. తీవ్ర ఒత్తిడిలో ఎంతో గొప్పగా బౌలింగ్ చేసిన ఎవాన్స్ తరువాతి మూడు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి నవాజ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పాక్ విజయానికి చివరి బంతికి మూడు పరుగులు అవసరం అయ్యాయి. షాహీన్ అఫ్రిధి(1) లాంగాన్‌లో భారీ షాట్ ఆడాడు. తొలి పరుగు పూర్తి చేసి రెండో పరుగు చేసే క్రమంలో రనౌట్ అయ్యాడు. ఫీల్డర్ త్రో చేసిన బంతిని అందుకునే క్రమంలో వికెట్ కీపర్ చకబ్వా తొలుత తడబడ్డా.. సరైన సమయంలో బంతిని అందుకుని బెయిల్స్‌ను ఎగరేశాడు.
పాక్‌ను ఓడించిన జింబాబ్వే ప్రపంచకప్పు నెగ్గినంత సంబురపడిపోతే.. పాక్ ఆటగాళ్లు మాత్రం మరోమారు తమ అనిశ్చితిని క్రీడాలోకానికి చాటారు. జింబాబ్వే బౌలర్లలో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' సికందర్ రజా 3, బ్రాడ్ ఇవాన్స్ రెండు వికెట్లు పడగొట్టారు.