అభిషేక్ శర్మ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆదివారం జరిగిన ఐదో, చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అభిషేక్ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. అయితే అభిషేక్ ప్రదర్శనపై అతడి గురువు యువరాజ్ సింగ్ స్పందించాడు.
అభిషేక్ ఇన్నింగ్స్ తర్వాత యువరాజ్ ట్వీట్ చేస్తూ.. అభిషేక్ ఎంతో గొప్ప ప్రదర్శన చేశాడు! ఇలాగే నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను అని ట్వీట్ చేశాడు. అంతకుముందు తొలి టీ20లో అభిషేక్ 34 బంతుల్లో 79 పరుగులు చేసిన సమయంలో కూడా యువరాజ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 'సిరీస్‌లో అబ్బాయిలకు శుభారంభం! మా బ్యాట్స్‌మెన్ బాగా ఆడారు. అభిషేక్ శర్మ, మంచి ఇన్నింగ్స్.. అంటూ ట్వీట్ చేశాడు.
24 ఏళ్ల అభిషేక్ ముంబైలో కేవలం 17 బంతుల్లో తన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత కేవలం 37 బంతుల్లో అద్భుతమైన సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను కేవలం 10.1 ఓవర్లలో తన సెంచరీని చేరుకున్నాడు. ఇది T20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైనది.