డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆఖరి రోజు.. 98 ఓవర్ల ఆట.. ఏదైనా సాధ్యమే
WTC Final Day 6 India VS New zealand.ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తర దశకు చేరుకుంది.
By తోట వంశీ కుమార్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తర దశకు చేరుకుంది. నేడు రిజర్వుడే అయిన ఆరో రోజు విజేతలు ఎవరో తేలనుంది. ఈ మ్యాచ్‌కు ఐదు రోజులుగా వరుణుడు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. దీంతో రెండు రోజుల పూర్తి ఆట రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే.. చివరి రోజు వాతావరణం ఎలా ఉంటుంది అన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. అయితే.. వాతావరణ శాఖ క్రీడాభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ రోజు వర్షం కురిసే అవకాశం లేదని చెప్పింది. దీంతో ఈ రోజు పూర్తి ఆట సాగే అవకాశం ఉంది. దీంతో నేడు 98 ఓవర్లు వేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎండ కాస్తే భారత్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉండగా.. చల్లని వాతావరణం ఉంటే.. కివీస్ చెలరేగడం ఖాయం. అలా కాకుండా ఇరు జట్లు బాగా ఆడితే.. మ్యాచ్ డ్రా కావచ్చు.
డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయినా ఆశ్చర్యం లేదు. నిజానికి న్యూజిలాండ్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. రిజర్వ్ డే రోజున ఒకవేళ ఇండియాను త్వరగా ఔట్ చేస్తే, టార్గెట్‌ను చేజ్ చేసేందుకు వాళ్లకు కావాల్సిన సమయం ఉంటుంది. ఇండియాకు కూడా గెలిచే ఛాన్సు ఉంది. కోహ్లీసేన చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసి.. డిక్లేర్ చేస్తే అప్పుడు కివీస్‌ను వేగంగా ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 217 పరుగులకు ఆలౌట్ కాగా.. డేవాన్ కాన్వే(54), కేన్ విలియమ్ సన్(49) రాణించడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేసింది. దీంతో కీలకమైన 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం న్యూజిలాండ్‌కు దక్కింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులతో నిలిచింది. నయావాల్ పుజారా(12), కెప్టెన్ కోహ్లీ(8) పరుగులతో క్రీజులో ఉన్నారు. వరుణుడు అడ్డుతగలడు కనుక ఆఖరి రోజు మ్యాచ్ రసవతర్తంగా జరగడం ఖాయం.