ఆసీస్ ముందు భారీ లక్ష్యం.. ఇక భారమంతా బౌలర్లదే
Women’s World Cup 2022 India set Australia target of 278.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా ఆక్లాండ్
By తోట వంశీ కుమార్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా ఆక్లాండ్ వేదికగా శనివారం భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్(68; 96 బంతుల్లో 4పోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా( 59; 83 బంతుల్లో 6 పోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్(57; 47 బంతుల్లో 6 పోర్లు ) అర్థశతకాలతో రాణించగా.. ఆఖర్లో పూజా వస్త్రాకర్ (34; 28 బంతుల్లో 1పోర్, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ మంచి స్కోర్ సాధించింది.
బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన(10), షెఫాలి వర్మ(12)లు ఇద్దరూ తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. దీంతో భారత్ 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీరాజ్, యస్తిక రాజ్ ఇన్నింగ్స్ బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలుత ఆచితూచి ఆడిన ఈ జోడి తరువాత పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 130 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అర్థశతకాలు పూర్తి చేసుకున్న తరువాత స్వల్ప వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఆ తరువాత వచ్చిన రీచా ఘోష్(8), స్నేహ్‌రాణా(0) విఫలమైన హర్మన్, పూజా వస్త్రాకర్ ధాటిగా ఆడడంతో భారత్.. ఆస్ట్రేలియా ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్రపంచకప్ బరిలో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత్‌కు తప్పనిసరి.