మహిళల ప్రపంచకప్ 2022 టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న భారత జట్టు మంగళవారం బంగ్లాదేశ్ ముందు ఓ మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది. హామిల్టన్ వేదికగా సెడాన్ పార్క్ మైదానంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యస్తిక బాటియా(50) అర్థశతకంతో రాణించగా..షెఫాలీ వర్మ(42), స్మృతి మంధాన 30, పూజా వస్త్రాకర్(30 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ మిథాలీ రాజ్ డకౌట్ కాగా.. హర్మన్ కౌర్ (14) విఫలం అయ్యారు. మిగిలిన వారిలో రిచా ఘోష్ 26, స్నేహ్ రాణా 27 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రితు మోని మూడు వికెట్లు పడగొట్టగా.. నహిదా రెండు, జహనర ఓ వికెట్ తీసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఈ దశలో బంగ్లా బౌలర్లు విజృంబించడంతో స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరితో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ వికెట్లను భారత్ కోల్పోయింది. దీంతో 74 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ యస్తిక బాటియా ఒంటరి పోరాటం చేయగా.. ఆఖర్లో ఆల్‌రౌండర్లు రాణించడంతో భారత్ 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది.