ఆట మీదే దృష్టి.. ప్రణాళికలు అమలు చేస్తామన్న కేన్
Williamson speeks on the T20 World Cup Final 2021.దుబాయ్ వేదికగా నేడు జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్
By తోట వంశీ కుమార్ Published on 14 Nov 2021 2:38 PM IST
దుబాయ్ వేదికగా నేడు జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. విజయం సాధించి తొలి సారి పొట్టి కప్పును ముద్దాడాలని ఇరు జట్లు గట్టి పట్టిదలతో ఉన్నాయి. పైనల్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్ని మ్యాచుల్లాగా ఇది ఒక సాధారణ మ్యాచేనని కేన్ అన్నాడు. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారిస్తామన్నాడు. గెలవడానికి శాయశక్తుల కృషి చేస్తామని తెలిపాడు.
పైనల్ చేరామంటే ఇది మా కష్టానికి ప్రతిఫలం అని చెప్పాడు. జట్టంతా కలిసికట్టుగా ఆడుతోందన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒకటి నేర్చుకోవడం ముఖ్యమైన విషయం అని.. ఫైనల్ మ్యాచ్ కూడా ఓ అవకాశంగానే భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక సెమీస్‌లో 46 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డెవాన్ కాన్వే లేకపోవడం నిజంగా పెద్దలోటని అన్నాడు. అన్ని పార్మాట్లలో అతడు కీలక ఆటగాడని చెప్పాడు. ఫైనల్ ఆడకపోవడం నిరాశకలిగించింది. ఇలా జరగడం దురష్టం. అయినా.. విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నామన్నాడు. ఇక మా పొరుగుదేశంతో ఫైనల్ మ్యాచ్ ఆడడం చాలా గొప్పగా ఉందని.. ఇది రెండు జట్లకూ నూతనోత్తేజం కలిగిస్తుందన్నాడు.
ఇదిలా ఉంటే.. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా.. కివీస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ప్రతికారం తీర్చుకోవాలని కివీస్ బావిస్తోంది.