ఇంగ్లాండ్‌తో తొలి వన్డే నేడే.. కోహ్లీ ఆడేది అనుమానం
Will Team India replicate T20 template in ODIs against England.టి20 సిరీస్ గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు
By తోట వంశీ కుమార్ Published on 12 July 2022 11:16 AM ISTటి20 సిరీస్ గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. పొట్టి ఫార్మాట్‌లో దూకుడుగా ఆడినట్లుగానే వన్డే సిరీస్‌లోనూ ఆడాలని టీమ్ఇండియా భావిస్తోంది. మరో వైపు పొట్టి ఫార్మాట్‌లో ఎదురైన పరాభవానికి వన్డే సిరీస్ నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. బలాబలాల పరంగా రెండు జట్లు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో హోరా హోరీ పోరు జరగడం ఖాయం. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు(మంగళవారం) ఓవల్ మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభాన్ని దక్కించుకోవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి.
గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరం కావడంతో శిఖర్ ధావన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రోహిత్ తో కలిసి శిఖర్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా పరుగులు చేయడానికి కోహ్లీ ఇబ్బందులు పడుతున్నాడు. అయితే.. గాయం కారణంగా అతడు తొలి వన్డేలో ఆడేది అనుమానంగా మారింది. దీంతో చివరి టి20లో అద్భుత సెంచరీతో అలరించిన సూర్యకుమార్ యాదవ్‌కు వన్డే జట్టులో చాన్స్ దక్కొచ్చు. ఇదే జరిగితే శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెట్టే అవకాశాలున్నాయి. హిట్టర్లు రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ జడేజాలతో బ్యాటింగ్ ఆర్డర్‌కు ఢోకా లేదు. బుమ్రా, షమితో పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది. మూడో పేసర్‌గా ప్రసిద్ద్ కృష్ణ లేదా శార్దూల్ ఠాకూర్‌లలో ఎవరో ఒకరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కనుంది. స్పిన్ భారాన్ని చహల్, జడేజా మోయనున్నారు.
ఇయాన్ మోర్గాన్ రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత కెప్టెన్సీ బాధ్యతలను బట్లర్ చేపట్టాడు. అతడికి ఇదే తొలి వన్డే సిరీస్. టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బట్లర్ చూస్తున్నాడు. టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్ అందుబాటులోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. జేసన్ రాయ్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్‌లు రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.అయితే బౌలింగ్ దళం కాస్త మారింది. డేవిడ్ విల్లే, రీస్ టోప్లేలకు బ్రైడన్ కార్స్ జత అయ్యాడు.