సెప్టెంబ‌ర్‌లో మిగ‌తా సీజ‌న్‌.. భార‌త్‌లో అయితే కాదు..?

Will IPL 2021 resume in September. ఐపీఎల్‌ మిగ‌తా సీజ‌న్‌ . ఇత‌ర దేశాల క్రికెట్ షెడ్యూళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 8:30 AM GMT
IPL resume in september

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌) అభిమానుల‌కు నిజంగా ఇది శుభ‌వార్త అనే చెప్ప‌వ‌చ్చు. క‌రోనా కార‌ణంగా ఐపీఎల్ 2021 సీజ‌న్ టోర్నీ మ‌ధ్య‌లోనే వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే.. మిగ‌తా సీజ‌న్ ఎప్పుడు జ‌రుగుతుందోన‌ని క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. మిగిలిన సీజ‌న్‌ను పూర్తి చేసేందుకు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ), ఐపీఎల్ పాల‌క మండ‌లిలు స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇత‌ర దేశాల క్రికెట్ షెడ్యూళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబ‌ర్‌లో మిగ‌తా సీజ‌న్‌ను నిర్వ‌హించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే.. సెప్టెంబ‌ర్‌లో భార‌త్‌లో మూడో వేవ్ విజృంభిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో మిగిలిన సీజ‌న్‌ను యూఏఈ, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంలో నిర్వ‌హించాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

ఎక్కడ నిర్వ‌హించే అవ‌కాశం ఎక్కువ ఉందంటే..?

గ‌తేడాది భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంగా యూఏఈలో ఐపీఎల్ సీజ‌న్‌ను విజ‌యవంతంగా నిర్వ‌హించారు గ‌నుక ఈ సారి కూడా మిగిలిన సీజ‌న్‌ను అక్క‌డే నిర్వ‌హిస్తే మంచిది. అక్క‌డి పిచ్‌లు, వాతావ‌ర‌ణం, బ‌యో బుడ‌గ పై ఆట‌గాళ్ల‌తో పాటు ప్రాంచైజీల‌కు ఓ అవ‌గాహాన ఉంది. యూఏఈకి వ‌చ్చేందుకు ఇత‌ర దేశాల క్రికెట‌ర్ల‌కు పెద్ద‌గా అభ్యంత‌రం ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ లీగ్ ముగిసిన అనంత‌రం భార‌త్ ఆతిథ్యమివ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ క‌ప్‌ను కూడా అక్క‌డే నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

ఇంగ్లాడ్‌లో జూలైలో ఐసీసీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ పైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ఇండియా, కివీస్ ఇందులో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ ముగిసిన అనంత‌రం.. ఇంగ్లాండ్ జ‌ట్టుతో భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్ ముగిసే స‌రికి సెప్టెంబ‌ర్ అవుతుంది క‌నుక అక్క‌డే నిర్వ‌హిస్తే.. ఆట‌గాళ్లకు మ‌ళ్లీ క్వారంటైన్ ఉండ‌దు క‌నుక అక్క‌డే నిర్వ‌హించ‌వ‌చ్చు. కాగా.. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో క‌ఠిన ఆంక్ష‌లు అమ‌ల్లో ఉన్నాయి. మ‌రో నాలుగు నెల‌ల్లో ఆ దేశం క‌నుక ఆంక్ష‌లు తొలగిస్తే.. అక్క‌డ నిర్వ‌హించే అవకాశం కొట్టిపారేయ‌లేము.


Next Story