ఓటమి తర్వాత కూడా హ్యాపీగా ఉన్న ముంబై కెప్టెన్.. కారణమిదే..!
ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్‌ను విజయంతో ప్రారంభించలేకపోయింది.
By Medi Samrat
ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్‌ను విజయంతో ప్రారంభించలేకపోయింది. ఆదివారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2013 తర్వాత ఈ సీజన్‌లో ముంబై తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే తొలి మ్యాచ్ తర్వాత ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ హ్యాపీగా కనిపించాడు. దీనికి కారణం విఘ్నేష్ పుతూర్. విఘ్నేష్ ఆదివారం ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి చెన్నైపై ఆధిపత్యం చెలాయించాడు. తన తొలి మ్యాచ్‌లో విఘ్నేష్ నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తన స్పిన్‌తో చెన్నైని ఇబ్బందిపెట్టి ఎవరూ మరిచిపోలేని ముద్ర వేశాడు.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ విఘ్నేష్‌పై విపరీతంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం అతను ఇలా అన్నాడు.. "ముంబై స్కౌట్ జట్టు అతని కోసం 10 నెలలు గడిపింది. దీని ఫలితమే అతడు. నేను అతడి ఓవర్‌ల కోటాలో ఒకదాన్ని చివరి వరకూ ఉంచాను. తద్వారా మ్యాచ్ చివరి వరకు వెళితే నేను దానిని ఉపయోగించుకోవచ్చు. అతనికి మ్యాచ్ 18వ ఓవర్ ఇవ్వడం కొసమెరుపు. పిచ్‌పై మంచు లేదు అన్నాడు. అతడి ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
విఘ్నేష్ కేరళలోని మలప్పురం నివాసి. అతడు 11 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. స్టార్ స్పోర్ట్స్‌లో వ్యాఖ్యానిస్తూ.. తన తండ్రి ఆటో రిక్షా డ్రైవర్ అని చెప్పాడు. తను కేరళ తరపున ఇంకా ఫస్ట్ క్లాస్ లేదా లిస్ట్-ఎ మ్యాచ్ ఆడలేదు.
ముంబైకి చెందిన స్కౌట్ బృందం కేరళ ప్రీమియర్ లీగ్‌లో అలెప్పీ రిపుల్స్ తరపున ఆడుతున్న ఈ ఆటగాడిని కనిపెట్టి.. వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి రాబోయే మ్యాచ్‌లలో అతనిపైనే ఉండనుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ జట్టులో ఏ ఆటగాడు హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. తిలక్ వర్మ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. దీపక్ చాహర్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ లక్ష్యాన్ని చెన్నై 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది. చెన్నై జట్టులో రచిన్ రవీంద్ర 45 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 65 పరుగులు చేశాడు. రితురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 53 పరుగులు చేశాడు.