రెండా..? ఒకటా..? నేడే ఐపీఎల్ ఫైనల్
Who will win today’s IPL match between Gujarat and Rajasthan.మెరుపు బ్యాటింగ్, అబ్బుర పరిచే బౌలింగ్, వారెవ్వా
By తోట వంశీ కుమార్ Published on 29 May 2022 8:07 AM GMTమెరుపు బ్యాటింగ్, అబ్బుర పరిచే బౌలింగ్, వారెవ్వా అనిపించే ఫీల్డింగ్ విన్యాసాలతో రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2022 సీజన్ నేటితో ముగియనుంది. ఆదివారమే తుది పోరు. టోర్నిలో అత్యుత్తమంగా రాణించిన జట్లే ఫైనల్‌లో తలపడనున్నాయి. లీగ్‌లో టాప్-2లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ లు అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో కప్పు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అరంగేట్ర సీజన్‌లోనే అదుర్స్ అనిపిస్తూ ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ అదే ఊపులో కప్పు సాధించాలని చూస్తుండగా, ఆరంభ సీజన్‌లో కప్పు గెలిచిన తరువాత 14 ఏళ్లకు ఫైనల్‌కు చేరిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి టైటిల్ చేజిక్కించుకుని.. తొలిసారి కప్పు అందించిన షేన్‌వార్న్‌కు ఘనమైన నివాళులర్పించాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు జరగడం ఖాయం.
ఐపీఎల్‌లో తొలిసారి అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు రంగాల్లో సమిష్టి ప్రదర్శనతో ఫైనల్ చేరింది. ఏ ఒక్క ఆటగాడిపై జట్టు ఆధారపడలేదు. లీగ్ దశలో 9 మంది వేర్వేరు ఆటగాళ్లు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లు' గా నిలవడమే అందుకు ఉదాహారణ. శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ అందుబాటులో ఉండగా.. వన్‌డౌన్‌లో మాథ్యూ వేడ్, ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా రానున్నారు. వీరిలో ఏ ఇద్దరు క్రీజులో నిలదొక్కుకున్నా భారీ స్కోరు ఖాయమే. ఇక వీరికి తోడు మిల్లర్, రాహుల్ తెవాటియా లు ఆఖర్లో దంచికొట్టేందుకు సిద్దంగా ఉండగా.. తాను తక్కువ ఏమీ కాదు అంటూ రషీద్ ఖాన్ బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోతున్నాడు.
ఇక బౌలింగ్‌లో రషీద్ ఖాన్ ప్రత్యర్థులకు చుక్కులు చూపిస్తుండగా, షమీ చెలరేగిపోతున్నాడు. వీరితో పాటు జోసెఫ్, ఫెర్గూసన్ ఉండనే ఉన్నారు. ఫైనల్‌లో వీరంతా సత్తా చాటితే తొలిసారే టైటిల్ గెలవడం గుజరాత్ కు పెద్ద కష్టమేమి. కాదు.
ఇక ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అద్వితీయ ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. రాజస్థాన్ విజయావకాశాలు బట్లర్ మీదే ఉన్నాయనడంతో సందేహాం లేదు. 16 మ్యాచ్‌ల్లో 58.86 సగటుతో 824 పరుగులు సాధించాడు. లీగ్ దశ ఆఖర్లో కొన్ని మ్యాచుల్లో విఫలమైన బట్లర్.. ప్లే ఆఫ్స్‌లోకి వచ్చాక జోరందుకున్నాడు. తొలి క్వాలిఫయర్‌లో 89 పరుగులు చేసిన బట్లర్, రెండో క్వాలిఫయర్‌లో శతకంతో చెలరేగాడు. ఇక బౌలింగ్‌లో చాహల్ 19.50 సగటుతో 26 వికెట్లు పడగొట్టి వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, హిట్ మెయిర్‌లతో పాటు మరోసారి బట్లర్ రాణిస్తే రాజస్థాన్‌కు విజయం నల్లేరు పై నడకే అనడంలో సందేహాం లేదు.
ఇక ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా రెండు సార్లు గుజరాతే విజయం సాధించింది.