పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకున్నాడు. తనదైన శైలిలో పరుగులు రాబడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతడి ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 64 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేలా జయవర్థనే పేరిట ఉన్న ఓ రికార్డును చెరిపివేసి తన పేరును లికించుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఇక తన రికార్డును బ్రేక్ చేయడంపై మహేళా జయవర్థనే స్పందించాడు. "రికార్డులు ఉన్నవే బ్రేక్ చేయడానికి అని, నా రికార్డులు చెరిపివేసి కొత్తవి సృష్టించేందుకు ఒకడుంటాడు. అతడే విరాట్ కోహ్లీ. ఈ గొప్ప ఆటగాడికి నా అభినందనలు. నువ్వెప్పుడూ యోధుడివే. ఫామ్ ఎప్పడూ తాత్కాలికమే. క్లాస్ మాత్రమే శాశ్వతం. బాగా ఆడావు మిత్రమా" అని జయవర్థనే అన్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో జయవర్ధనే 31 ఇన్నింగ్స్‌ల్లో 1016 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ 25 ఇన్నింగ్స్‌ల్లోనే (1,065) మహేలాను అధిగమించాడు.
ఇదిలాఉంటే.. టీమ్ఇండియా ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండానే సెమీస్ చేరనుంది. ఒక వేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.