155.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ ఐపీఎల్ శాల‌రీ ఎంతో తెలుసా.?

మయాంక్ యాదవ్ రూపంలో భారత క్రికెట్‌కు ఓ ఫాస్ట్ బౌలర్ దొరికినట్లు కనిపిస్తోంది. శనివారం లక్నో సూపర్‌జెయింట్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన

By Medi Samrat  Published on  31 March 2024 9:14 AM GMT
155.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ ఐపీఎల్ శాల‌రీ ఎంతో తెలుసా.?

మయాంక్ యాదవ్ రూపంలో భారత క్రికెట్‌కు ఓ ఫాస్ట్ బౌలర్ దొరికినట్లు కనిపిస్తోంది. శనివారం లక్నో సూపర్‌జెయింట్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. తన పేస్‌తో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌లలో భయాన్ని నింపాడు. ఎకానా స్టేడియంలో మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుతమైన ప్రదర్శనతో లక్నో సూపర్‌జెయింట్‌ పంజాబ్ కింగ్స్‌ను 21 పరుగుల తేడాతో ఓడించి టోర్నమెంట్‌లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే.. మ‌యాంక్‌.. శిఖర్ ధావన్‌కు వేసిన‌ 12వ ఓవర్ తొలి బంతి 155.8 కిలోమీటర్ల వేగంతో విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. 21 ఏళ్ల ఈ పేసర్ తన బౌలింగ్‌తో ఆకట్టుకుని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

మ్యాచ్ త‌ర్వాత మ‌యాంక్ మాట్లాడుతూ.. నా అరంగేట్రం ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు. అరంగేట్రం చాలా ఆందోళనగా ఉంటుందని నేను ఇతర వ్యక్తుల నుండి విన్నాను.. కానీ మొదటి బంతి తర్వాత నా ఆందోళన పోయింది. అందరూ ఒత్తిడి తీసుకోవద్దని.. కేవలం బౌలింగ్ చేసి ఫుల్ స్పీడ్‌ని ఉపయోగించాలని చెప్పారు. అదే నేను చేసానని పేర్కొన్నాడు.

మయాంక్ యాదవ్ తన అరంగేట్రం మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో మయాంక్ యాదవ్ ఐపీఎల్ జీతం ఎంత అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. 2022 మెగా వేలంలో మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ అతని బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, జట్టు కూర్పు, గాయాల కారణంగా మయాంక్ యాదవ్ అరంగేట్రం వాయిదా పడింది. చివరగా శనివారం ఈ యువ ఫాస్ట్ బౌలర్ తన ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని పొంది.. స‌ద్వినియోగం చేసుకున్నాడు.

Next Story