వెస్టిండీస్‌తో రెండో వ‌న్డే.. భార‌త్ ఫ‌స్ట్ బ్యాటింగ్‌.. విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.

West Indies win toss opt to bowl against India in 2nd ODI.అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో వెస్టిండీస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2022 1:36 PM IST
వెస్టిండీస్‌తో రెండో వ‌న్డే.. భార‌త్ ఫ‌స్ట్ బ్యాటింగ్‌.. విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో వెస్టిండీస్ జ‌ట్టు టాస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. తొలి వ‌న్డేలో గెలిచిన జ‌ట్టులో టీమ్ఇండియా ఒక మార్పును చేసింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో తొలి వ‌న్డేకు దూర‌మైన ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ రావ‌డంతో ఇషాన్ కిష‌న్‌పై వేటు వేశారు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు రాహుల్ ఓపెనింగ్ చేయ‌నున్నాడు. మ‌రోవైపు వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో నికోల‌స్ పూర‌న్ సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. మూడు వ‌న్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన‌.. ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని బావిస్తోంది.

భార‌త జ‌ట్టు : రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లీ, రిష‌బ్‌పంత్‌(వికెట్ కీప‌ర్‌), సూర్య కుమార్ యాద‌వ్‌, దీప‌క్ హుడా, వాషింగ్ట‌న్ సుంద‌ర్, శార్ధూల్ ఠాకూర్‌, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, చాహ‌ల్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ‌

వెస్టిండీస్ జ‌ట్టు : షై హోప్‌(వికెట్ కీప‌ర్‌), బ్రాండ‌న్ కింగ్‌, డారెన్ బ్రావో, బ్రూక్స్‌, నికోల‌స్ పూర‌న్‌(కెప్టెన్‌), జేస‌న్ హోల్డ‌ర్‌, అకేల్ హోసేన్, ఫాబియన్ అలెన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్

కోహ్లీ ఖాతాలో మ‌రో రికార్డు..

ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లికి స్వదేశంలో 100వ వన్డే మ్యాచ్. వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 258 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ స్వదేశంలో 99 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్‌ చరిత్రలో ఇలా స్వదేశాల్లో 100 వన్డేలు ఆడిన ఆటగాళ్లు కోహ్లి కంటే ముందు 35 మంది మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో టీమ్ఇండియా నుంచి సచిన్ టెండూల్కర్(164), ఎంఎస్‌ ధోని(127), అజహారుద్దీన్(113), యువరాజ్‌ సింగ్‌(108)లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి స్వదేశంలో ఆడిన 99 మ్యాచ్‌ల్లో 60 సగటుతో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 25 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక కోహ్లీ అన్ని ఫార్మాట్ల‌లో శ‌త‌కం చేసి రెండేళ్ల‌కు పైగానే అయ్యింది. క‌నీసం ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లీ శ‌త‌కం చేయాల‌ని అత‌డి అభిమానులు అశిస్తున్నారు.

Next Story