కాన్పూర్ వేదికగా రేపటి నుంచి(గురువారం) టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్లకు అందించే ఆహారంపై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లకు అందించే ఆహారంలో పంది మాంసం, బీఫ్ పై నిషేధం విధించినట్టు వార్తలు వచ్చాయి. హలాల్ చేసిన మాంసాన్ని అందించనున్నారని ఆయా కథనాల సారాంశం. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని విమర్శిస్తున్నారు.
కాగా.. దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ స్పందించారు. ఆటగాళ్ల ఆహారపు అలవాట్లపై బీసీసీఐ జోక్యం చేసుకోదన్నాడు. ఆటగాళ్ల డైట్ ఫ్లాన్‌కు సంబంధించి బీసీసీఐ ఎలాంటి నిబంధనలు విధించలేదన్నాడు. ఆటగాళ్లు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చునని చెప్పుకొచ్చాడు. అది మాంసాహారమా..? శాకాహారమా..? అనే ది ఆటగాళ్ల ఇష్టమని ధూమల్ అన్నారు.
ఇదిలా ఉంటే.. తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశాంత్రి నిచ్చిన నేపథ్యంలో అజింక్యా రహానే సారధ్యంలో టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది. రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు.