దారుణ ప్రదర్శన తర్వాత.. హార్దిక్ పాండ్యా చెప్పింది ఇదే!!

ఐపీఎల్ 2024 టైటిల్ కు బలమైన పోటీదారుగా భావించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో దారుణమైన ప్రదర్శన చేసింది.

By M.S.R  Published on  18 May 2024 12:00 PM IST
cricket, Hardik Pandya, IPL2024, MumbaiIndians

దారుణ ప్రదర్శన తర్వాత.. హార్దిక్ పాండ్యా చెప్పింది ఇదే!! 

ఐపీఎల్ 2024 టైటిల్ కు బలమైన పోటీదారుగా భావించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో దారుణమైన ప్రదర్శన చేసింది. ఆఖరి లీగ్ మ్యాచ్ లో కూడా ఓటమిని మూట గట్టుకుని సీజన్ లో ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. అయితే తమ జట్టు నాణ్యమైన క్రికెట్ ఆడలేదని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ అంగీకరించాడు. ఎంఐ జట్టు తమ ప్రమాణాలకు అనుగుణంగా రాణించకపోవడం వల్ల జట్టుకు నష్టం వాటిల్లిందని హార్దిక్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం మే 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో LSGతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడి పాయింట్స్ పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఫ్రాంచైజీకి ఇది చాలా కష్టమైన సీజన్ అని హార్దిక్ వివరించాడు. జట్టు నాణ్యమైన క్రికెట్ ఆడలేదని, అదే మ్యాచ్ ఫలితాల్లో ప్రతిబింబిస్తోందని హార్దిక్ తెలిపాడు. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు సీజన్ మొత్తం సరిగా ఆడలేకపోయిందని అన్నాడు. వృత్తిపరంగా కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు చెడ్డ రోజులు ఉంటాయని చెప్పాడు. స్మార్ట్ క్రికెట్ ఆడలేకపోయాం.. ఈ సీజన్ మొత్తం ఏది తప్పు జరిగిందనే విషయాన్ని ఎత్తిచూపడం చాలా తొందరపాటే అవుతుందన్నాడు. కానీ వచ్చే సీజన్ లో మాత్రం చాలా బలంగా వస్తామని హార్దిక్ ధీమా వ్యక్తం చేశాడు.

గత మూడు సంవత్సరాలలో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడం ఇది రెండో సారి. 2024కి ముందు, 2022లో కూడా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచారు. ఈ సీజన్ లో కెప్టెన్సీ మార్పు తర్వాత జట్టు సమిష్టిగా రాణించడంలో విఫలమవ్వగా.. అభిమానులు ఏ మాత్రం ముంబైకి మద్దతు ఇవ్వలేదు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో 4 విజయాలను మాత్రమే సాధించింది.

Next Story