పాక్ జట్టుకు కోచ్‌గా విదేశీ కోచ్‌లు రారు : వసీం అక్రమ్

Wasim Akram On Foreign Coaches Refusing To Come To Pakistan. పాకిస్థాన్ క్రికెట్ జట్టు చుట్టూ ఎన్ని వివాదాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By M.S.R  Published on  18 Jan 2023 8:15 PM IST
పాక్ జట్టుకు కోచ్‌గా విదేశీ కోచ్‌లు రారు : వసీం అక్రమ్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు చుట్టూ ఎన్ని వివాదాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుకు కోచ్ అవ్వాలంటే చాలా కష్టాలు ఉంటాయి. ఇక విదేశీ కోచ్ లు వచ్చారంటే కొందరు వారికి చుక్కలు చూపిస్తూ ఉంటారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్‌గా నజం సేథీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అనేక మార్పులు మొదలయ్యాయి. అనేక మంది ఆఫీస్ బేరర్‌లను తొలగించేశారు.. షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని కొత్త సెలెక్షన్ ప్యానెల్ ను కూడా తీసుకుని వచ్చారు. జాతీయ జట్టుకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రముఖ కోచ్ మిక్కీ ఆర్థర్‌ను నియమించాలని పీసీబీ కోరింది. అయితే, నివేదికల ప్రకారం ఈ పదవిని చేపట్టడానికి ఆర్థర్ రావడం లేదు. గతంలో ఎన్నో రాజకీయాలను ఆర్థర్ చూడడంతో ఇప్పుడు కోచ్ గా పదవిని చేపట్టాలంటేనే భయపడుతూ ఉన్నట్లు తెలుస్తోంది.

విదేశీ కోచ్‌లు పాకిస్థాన్‌కు రావడాన్ని, బాధ్యతలు చేపట్టడాన్ని నిరాకరిస్తున్న విషయంపై పాక్ పేస్ గ్రేట్ వసీం అక్రమ్ స్పందించారు."పాక్ జట్టుకు కోచ్ గా విదేశీ కోచ్‌లు రారని చెప్పాను, బోర్డు మారితే కాంట్రాక్ట్ కూడా అయిపోతుందని అందరూ భయపడుతున్నారు, మీకు విదేశీ కోచ్ రాకపోతే, పాకిస్తాన్ కు చెందిన వ్యక్తికి కోచ్ గా బాధ్యతలను ఇవ్వండి" అని అక్రమ్‌ అన్నారు. ఆర్థర్ పాకిస్థాన్‌కు రావడానికి భయపడుతున్నాడు. "పిసిబి ఛైర్మన్, నజామ్ సేథీ ఆర్థర్ తో చర్చలు ప్రారంభించి, ప్రధాన కోచ్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టామని అడగ్గా.. ఆర్థర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ క్రికెట్‌లో మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నానని, అయితే గతంలో తనకు బోర్డు విషయంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపాడు. అందుకే రావడానికి ఇష్టం లేదు”అని చెప్పినట్లు ఒక మూలం పిటిఐకి తెలిపింది.

"2019 ప్రపంచ కప్ సందర్భంగా ఎహ్సాన్ మణి నేతృత్వంలోని పిసిబి మేనేజ్‌మెంట్ ఆర్థర్ కాంట్రాక్ట్ పొడిగిస్తామని హామీ ఇచ్చిందని ఆర్థర్ సేథీతో చెప్పాడు. కానీ పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోకపోవడంతో అతని కాంట్రాక్ట్ నుండి తప్పించారు. డెర్బీషైర్‌తో తన దీర్ఘకాలిక ఒప్పందాన్ని ముగించుకుని, పాకిస్తాన్‌కు రావాలని నిర్ణయించుకున్నప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్‌లోని వాతావరణం, అక్కడి పెద్దల గ్యారెంటీ లేని మాటల కారణంగా ఆర్థర్‌కు భయం ఉంది" అని అంటున్నారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని వసీం అక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


Next Story