టీమిండియా పిలుపు అందుకున్న వైజాగ్ క్రికెటర్ నితీష్ కుమార్
జింబాబ్వేలో జరిగే టీ20 సిరీస్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ఆటగాడు నితీష్ కుమార్ ఎంపికయ్యాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Jun 2024 11:19 AM ISTటీమిండియా పిలుపు అందుకున్న వైజాగ్ క్రికెటర్ నితీష్ కుమార్
జింబాబ్వేలో జరిగే టీ20 సిరీస్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ఆటగాడు ఎంపికయ్యాడు. జులై 6 నుంచి హరారేలో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ లో విశాఖపట్నంకు చెందిన నితీష్ కుమార్ రెడ్డి ఆడనున్నాడు. జింబాబ్వేతో జరిగే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు శుభ్‌మాన్ గిల్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ (VDCA) ద్వారా శిక్షణ పొందిన నితీష్ రెడ్డి తొమ్మిదేళ్ల వయసు నుండి కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు.
2017-18 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్రా తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించినప్పుడు నితీష్ తొలిసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత నాగాలాండ్‌పై 345 బంతుల్లో 441 పరుగులు చేసింది. 176.41 సగటుతో 1237 పరుగులు చేసి టోర్నమెంట్ చరిత్రలో రికార్డు స్కోరు సాధించాడు. ఆ సీజన్‌లో అతనికి BCCI ఉత్తమ U-16 క్రికెటర్‌గా అవార్డు లభించింది.
అతను సీమర్‌గా తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. దేశీయ క్రికెట్‌లో ఆంధ్ర సీనియర్ జట్టులో బౌలింగ్ వేసే వాడు. అతని ఆల్ రౌండ్ నైపుణ్యాలు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దృష్టిని ఆకర్షించాయి. 2023 IPL సీజన్‌కు ముందు, SRH అతన్ని INR 20 లక్షలకు కొనుగోలు చింది. కానీ అతనికి తొలి సీజన్‌లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. IPL 2024లో, SRH ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో నితీష్ రెడ్డి పాత్ర కూడా ఉంది. పంజాబ్ కింగ్స్‌పై 64 పరుగులు చేయగా.. SRH ఒక పరుగు తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అజేయమైన 76 పరుగులు పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో 21 ఏళ్ల నితీష్ కు బీసీసీఐ 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డును అందజేసింది.
భారతజట్టు జెర్సీ అందుకోవాలన్నదే అతడి లక్ష్యం:
బ్యాటింగ్ ఆల్-రౌండర్ అయిన అతడు తన జీవితం ఒక రోలర్‌కోస్టర్ రైడ్ అని చెప్పాడు. తన క్రికెట్ కెరీర్ కోసం తండ్రి ఉద్యోగాన్ని విడిచిపెట్టడంతో బంధువులు, తండ్రి ఫ్రెండ్స్ ఎంతగానో విమర్శించారన్నారు. అయితే తన తండ్రి చేసిన త్యాగానికి తగిన ప్రతిఫలాన్ని అందించాలని భావించేవాడినని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. 'భారత జట్టులో స్థానం దక్కించుకోవడం గర్వకారణం. కానీ అది 50 శాతం మాత్రమే. ఆ జెర్సీని ధరించి నా దేశం కోసం మ్యాచ్‌లు గెలిపించగలిగితేనే నా లక్ష్యం నెరవేరుతుంది. ఒకప్పుడు నా ప్రతిభను నమ్మిన తండ్రిని విమర్శించిన వారి కళ్ళల్లో నా తండ్రి పట్ల గౌరవం చూడాలని అనుకుంటూ ఉన్నాను ” అని అతను పిటిఐకి చెప్పాడు.
"మేము వైజాగ్ నుండి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, మా నాన్న మేము ఉండబోయే నగరం గురించి ఆరా తీశాడు. నాకు ట్రైనింగ్ ఇవ్వడం అక్కడ కుదురుతుందా అని కూడా ఆలోచించాడు. ఆ తర్వాత మా అమ్మతో మాట్లాడాడు.. ఉద్యోగం నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వం నుండి వచ్చిన సుమారు రూ. 20 లక్షలు తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే నాన్న సన్నిహితులు, స్నేహితులు డబ్బులు తీసుకుని మోసం చేశారు. ఈ సమయంలో తన సంపాదన మొత్తాన్ని కోల్పోయాడు" అని నితీష్ చెప్పాడు.
"ఉద్యోగం మానేసిన తర్వాత సర్వీస్‌లో సంపాదించిన సంపాదనను పోగొట్టుకున్నందుకు ప్రతి ఒక్కరూ మా నాన్నను తిట్టినవారే. మా బంధువులు, ఇరుగుపొరుగువారు కొడుకు ఆశయాలను నెరవేర్చడానికి ఎవరైనా ఉద్యోగం మానేస్తారా అంటూ తిట్టారు. ఇదంతా నా 12-13 సంవత్సరాల వయస్సులో జరిగింది. నేను ప్రతిదీ అర్థం చేసుకున్నాను, మా నాన్నగారి ప్రతిష్టను తిరిగి తీసుకుని రావాలని ఆరోజే నేను నిశ్చయించుకున్నాను" అని నితీష్ రెడ్డి PTI కి చెప్పాడు.
బంధువులు ఇప్పుడు నాన్నను మెచ్చుకుంటున్నారు:
అండర్ - 19 రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు పేరు తెచ్చుకున్న తర్వాత బ్యాట్ స్పాన్సర్‌లు వస్తారు. తండ్రికి తీవ్రమైన నష్టం రాగా.. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.
"నా జూనియర్ స్థాయి పోటీ క్రికెట్ ప్రారంభంలో, నేను ఒక సీజన్‌కు ఒక బ్యాట్ మాత్రమే నా దగ్గర ఉండేది. ఇప్పుడు ఉన్నంత ఖర్చుతో కూడుకున్నది కాదు, కానీ మంచి ఇంగ్లీష్ విల్లోకి ఇంకా ఎక్కువ డబ్బులే అవసరమవుతుంది. నా బ్యాట్ స్వీట్ స్పాట్‌లో పగుళ్లు కనిపిస్తాయి." అని గుర్తు చేసుకున్నాడు నితీష్.
SRH జట్టులో స్థానం దక్కడం.. మూడు వికెట్లను తీయడంతో పాటు 142 స్ట్రైక్-రేట్ తో 303 పరుగులు చేసిన తర్వాత, పరిస్థితులు మారిపోయాయి. "అప్పట్లో విమర్శించిన బంధువులు, ఇరుగుపొరుగు వారు మా నాన్న చేసిన రిస్క్ ను మెచ్చుకుంటున్నారు" అని సంతోషం వ్యక్తం చేశాడు నితీష్.
టీ20 సిరీస్ జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (WK), ధ్రువ్ జురెల్ (WK), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.