ఈ బ్యాట్స్‌మెన్ రియ‌ల్ హీరో..!

Vishnu Solanki slams hundred on returning to field after losing newborn daughter.రంజీ ట్రోఫీ 2022 సీజ‌న్‌లో బ‌రోడా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2022 6:26 PM IST
ఈ బ్యాట్స్‌మెన్ రియ‌ల్ హీరో..!

రంజీ ట్రోఫీ 2022 సీజ‌న్‌లో బ‌రోడా జ‌ట్టుకు చెందిన విష్ణు సోలంకి శ‌త‌కం సాధించాడు. ఇందులో ఏముంది.. శ‌త‌కం సాధించ‌డం గొప్పేం కాదుగా అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి. విష్ణు సోలంకి శ‌త‌కం వెనుక ఓ విషాద‌గాథ ఉంది. కొద్ది రోజులు క్రితం అత‌డి కుమారై ప్రాణాలు కోల్పోయింది. కుమారై మర‌ణించిన బాధ‌ను దిగ‌మింగుకుని మ‌రీ అత‌డు త‌న జ‌ట్టు కోసం బ్యాట్ ప‌ట్టి శ‌త‌కం సాధించాడు.

వివ‌రాల్లోకి వెళితే.. కొంత‌కాలం క్రిత‌మే విష్ణు సోలంకి తండ్రి అయ్యాడు. పాప పుట్టింద‌న్న అత‌డి ఆనందం రెట్టింపు చేస్తూ.. రంజీ ట్రోపీలో ఆడేందుకు బ‌రోడా జ‌ట్టు నుంచి విష్ణు కు పిలుపు వ‌చ్చింది. రంజీ ట్రోఫీ కోసం అత‌డు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. అయితే.. ఈ స‌మ‌యంలోనే అత‌డి కుమారై అనారోగ్యంతో క‌న్నుమూసింది. విష‌యం తెలిసిన వెంట‌నే విష్ణు ఇంటికి వెళ్లాడు. కుమారై అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాడు. అనంత‌రం క్రికెట్ పై ఉన్న మ‌క్కువ‌తో వెంట‌నే వ‌చ్చి బ‌రోడా జ‌ట్టుతో క‌లిసాడు.

అంత‌టి దుఃఖంలోనూ వ‌స్తూనే ఛండీఘ‌ర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సెంచ‌రీ(104) చేసి బ‌రోడా జ‌ట్టుకు భారీ ఆధిక్యాన్ని అందిచ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఛండీఘ‌ర్ తొలి ఇన్నింగ్స్‌లో 168 ప‌రుగుల‌కే ఆలౌట్ కాగా.. బ‌రోడా ప్ర‌స్తుతం ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 517 ప‌రుగులు చేసి.. 349 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.

పుట్టిన బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకి పై ప్ర‌శంస‌ల‌తో పాటు సంఘీభావం సందేశాలు వ‌స్తున్నాయి. బ‌రోడా క్రికెట్ అసోసియేష‌న్ సీఈవో శిశిర్ హ‌ట్ట‌న్‌గాడి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. కొద్ది రోజుల కింద‌ట కూతురుని కోల్పోయిన ఓ వీరుడి క‌థ ఇది. అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రై త‌రువాత జ‌ట్టుతో పాటు చేరిన విష్ణు సోలంకి శోకంలోనూ శ‌త‌కం చేశాడు. సోష‌ల్ మీడియాలో లైకుల కోసం అత‌డి పేరును వాడుకోవ‌ద్దు. నా వ‌ర‌కైతే విష్ణు సోలంకి రియ‌ల్ లైఫ్ హీరో. స్పూర్తివంతం అని ట్వీట్ చేశాడు.


Next Story