అప్పుడు కోహ్లీతో కలిసి భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు.. ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్‌..!

భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు పునరాగమనానికి సిద్ధమయ్యాడు.

By Medi Samrat
Published on : 19 March 2025 8:27 PM IST

అప్పుడు కోహ్లీతో కలిసి భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు.. ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్‌..!

భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు పునరాగమనానికి సిద్ధమయ్యాడు. 2008లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో భారత్‌ దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచకప్ టైటిల్ ద‌క్కించుకుంది. ఆ సమయంలో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తన్మయ్ శ్రీవాస్తవ ఆరు ఇన్నింగ్స్‌లలో 262 పరుగులు చేశాడు. అండర్-19 ప్రపంచ కప్ 2008లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇప్పుడు తన్మయ్ అంపైర్‌గా మళ్లీ క్రికెట్‌లోకి రావడానికి సిద్ధమయ్యాడు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన తన్మయ్ IPL 2025లో అంపైర్‌గా కనిపించనున్నాడు. దీంతో ఐపీఎల్‌లో ఆడడమే కాకుండా అంపైరింగ్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 35 ఏళ్ల తన్మయ్ శ్రీవాస్తవ 2008, 2009 ఐపీఎల్ సీజ‌న్‌ల‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడాడు. తన్మయ్ 2020లో అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఉత్తరప్రదేశ్ తరఫున అతడు 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 4,918 పరుగులు చేశాడు.

మలేషియాలో జరిగిన 2008 అండర్-19 ప్రపంచకప్‌లో తన్మయ్ 262 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు ఫైనల్‌లో 43 పరుగులు చేసి ముఖ్యమైన సహకారం అందించాడు. ఈ టీమ్‌కి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. అయితే సీనియర్‌ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Next Story