భారత జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విమర్శకుల టార్గెట్. టెస్టుల్లో అతడి బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడమే ఇందుకు కారణం. బంగ్లాదేశ్ సిరీస్, న్యూజిలాండ్ సిరీస్‌లలో కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్‌లేమీ ఆడలేదు. వచ్చే నెలలో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉండగా.. కోహ్లీ ఫామ్ ఆందోళనకరంగానే ఉంది. అయితే కోహ్లీ కు మాజీ చీఫ్ సెలక్టర్ మద్దతు లభించింది.
బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ మంచి ప్రదర్శన చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో జోషి మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియన్ టూర్‌ను బలమైన ఇన్నింగ్సులో ప్రారంభిస్తాడని నాకు చాలా నమ్మకం ఉంది. అతడు భారత్‌లో పరుగులు చేసి ఉండకపోవచ్చు, కానీ విరాట్ కోహ్లీ పెద్ద జట్లపై, భారీ మ్యాచ్‌లలో బాగా రాణిస్తాడని" అన్నాడు.
2018-19 సిరీస్‌లో టీమిండియా విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడని మరో మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్‌కే ప్రసాద్ అన్నారు. కోహ్లి, పుజారాల జోడి జట్టుకు సమతూకం అందించింది. 2018 సిరీస్‌లో కోహ్లి ఎలా రాణించాడో చూస్తే.. ఒకవైపు దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు.. మరోవైపు చెతేశ్వర్ పుజారా క్రీజులో పాతుకుపోయేవాడు.. ఈసారి మనకు ఈ కాంబినేషన్ ఉండదని అన్నాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ మొత్తం 88 పరుగులు చేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 99 పరుగులు మాత్రమే చేశాడు.