టెస్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న కోహ్లీ.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదీ

Virat Kohli said goodbye to Test team captaincy.ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2022 8:11 AM IST
టెస్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న కోహ్లీ.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదీ

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓట‌మి అనంత‌రం సుదీర్ఘ పార్మెట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీని కోహ్లీ వ‌దిలివేయ‌గా.. వ‌న్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) అత‌డిని త‌ప్పించింది. ఇక మిగిలి ఉన్న టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ త‌ప్పుకున్నాడు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా అత‌డు త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు.

ఈ మేర‌కు ఓ సుదీర్ఘ లేఖ‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు. దాదాపు ఏడేళ్ల పాటు కెప్టెన్‌గా జ‌ట్టును స‌రైన మార్గంలోనే న‌డిపించేందుకు త‌న పూర్తి స‌హాకారాన్ని అందించిన‌ట్లు వెల్ల‌డించాడు. ఇక ప్ర‌తి దానికి ముగింపు అంటూ ఉంటుంద‌ని చెప్పుకొచ్చాడు. అది త‌న‌ టెస్టు కెప్టెన్సీకి కూడా. 'ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తుప‌ల్లాను చూశాను. విజ‌యం కోసం 120 శాతం కృషి చేశా. న‌మ్మ‌కం లేకుండా ఏ రోజూ ఆడ‌లేదు. బీసీసీఐ, ర‌విశాస్త్రి, ఎంఎస్ ధోనికి కృత‌జ్ఞ‌త‌లు. ముఖ్యంగా కెప్టెన్సీ విష‌యంలో నా మీద న‌మ్మ‌కం ఉంచిన మ‌హీకి ధ‌న్య‌వాదాలు అంటూ 'విరాట్ ఆ లేఖ‌లో రాసుకొచ్చాడు.

2014లో మ‌హేంద్ర‌సింగ్ ధోని నుంచి టెస్ట్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లి.. 68 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు సార‌ధ్యం వ‌హించారు. అత‌డి కెప్టెన్సీలో 40 మ్యాచ్‌లో భార‌త జ‌ట్టును విజేత‌గా నిలిపాడు. అందులో ఎన్నో అద్భుతమైన విజ‌యాలు, మ‌రెన్నో రికార్డులు ఉన్నాయి. ఇక అత్య‌ధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు.

బీసీసీఐ రియాక్ష‌న్‌..

కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంపై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పందించింది. త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో టీమ్ఇండియాను కోహ్లీ ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చాడ‌ని కితాబునిచ్చింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పేర్కొంది. టెస్టు క్రికెట్‌లో కోహ్లీ అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా రాణించాడ‌ని తెలిపింది. 68 మ్యాచ్‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హించి 40 మ్యాచ్‌ల్లో విజ‌యాల‌ను అందించాడ‌ని చెప్పుకొచ్చింది.

Next Story