రోహిత్ శ‌ర్మ లేకుండా సిరీస్‌ గెల‌వ‌డం ఆనందంగా ఉంది : విరాట్ కోహ్లీ

Virat kohli On Rohit Sharma Missing. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు రోహిత్‌శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా లేకుండానే కంగారూల

By Medi Samrat  Published on  7 Dec 2020 6:23 AM GMT
రోహిత్ శ‌ర్మ లేకుండా సిరీస్‌ గెల‌వ‌డం ఆనందంగా ఉంది : విరాట్ కోహ్లీ

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు రోహిత్‌శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా లేకుండానే కంగారూల గ‌డ్డ‌పై టీ20 సిరీస్ గెల‌వ‌డం అద్భుత‌మ‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సిడ్ని వేదిక‌గా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో స‌మిష్టిగా రాణించిన కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి మ‌రో మ్యాచ్ ఉండ‌గానే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.

మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. టీ20 సిరీస్‌లో స‌మిష్టిగా ఆడామ‌న్నారు. జ‌ట్టులో ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త తీసుకుని చాలా చ‌క్క‌గా రాణించార‌న్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో ప్ర‌ధాన ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా లేకుండానే విజ‌యం సాధించ‌డం సంతోషంగా ఉందని చెప్పాడు. 'జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్ ద్వారా కనీసం 14 మ్యాచ్‌లు ఆడారు. కాబట్టి వారికి వారి ప్రణాళికలు తెలుసు. ప్రత్యర్థిని భారీ స్కోర్ చేయకుండా నిలువరించి.. చిన్న బౌండరీ సాయంతో చేధించాలనుకున్నాం. ఇక జట్టుగా రాణించి విజయాన్నందుకుంటే ఆ ఫీలింగ్ గొప్పగా ఉంటుంది. ఈ రోజు యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకున్నార‌ని' విరాట్ తెలిపాడు.

తొడ కండ‌రాల గాయం కార‌ణంగా రోహిత్ శ‌ర్మ ఆసీస్‌తో ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ల‌కు దూరం కాగా.. నాలుగు టెస్టులు ఆడాల్సి ఉండ‌డంతో.. బుమ్రాకు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. ఇక 22 బంతుల్లో 42 ప‌రుగులు సాధించిన పాండ్యను కోహ్లీ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. 'పాండ్య‌లో అపార నైపుణ్యం ఉంది. అలాగే ఇది తన సమయమని తెలుసుకున్నాడు. మరో నాలుగైదేళ్లు, ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును గెలిపించగలడు. అతని ప్రణాళికలు సరైనవి, అతన్ని ఇలా చూడటం ఆనందంగా ఉంది. పరిస్థితులను ఆకలింపు చేసుకోని ఆడాలనుకున్నాం. అభిమానుల నుంచి కూడా మాకు ఉత్సాహం లభించింది. ఏబీ డివిలియర్స్‌లా స్కూప్ షాట్ ఆడుతానని ఆండ్రూ టై ఊహించి ఉండడని హార్దిక్‌తో అన్నా. తాను కూడా ఏమాత్రం ఊహించలేదని చెప్పాడు. ఈ నైట్ ఈ షాట్ గురించి ఏబీడీకి మెసేజ్ చేస్తా. అతనేం అంటాడో చూస్తా'అని విరాట్ చెప్పుకొచ్చాడు.


Next Story