టీ20 ప్రపంచకప్ తరువాత కోహ్లీ రిటైర్‌మెంట్.. అక్తర్ జోస్యం
Virat Kohli might retire from T20Is after World Cup says Shoaib Akhtar.విరాట్ రిటైర్మెంట్ కావాలంటూ వ్యాఖ్యలు చేస్తూ
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2022 1:58 PM ISTటీమ్ ఇండియా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ చాలా రోజుల తరువాత శతకం చేసి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఆసియాకప్ 2022 టోర్నీలో ఆఫ్గాన్‌తో మ్యాచ్‌లో విరాట్ చేసిన సెంచరీ అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి 71వ శతకం. కాగా.. టీ20 ఫార్మాట్‌లో మొదటిది. విరాట్ ఫామ్ అందుకోవడంతో అభిమానులంతా ఆనందంగా ఉండగా.. పాక్ క్రికెటర్లు మరోసారి తమ వక్రబుద్దిని బయటపెట్టారు.
విరాట్ రిటైర్మెంట్ కావాలంటూ వ్యాఖ్యలు చేస్తూ విసుగుతెప్పిస్తున్నారు. మొన్న షాహిద్ అఫ్రిది.. కోహ్లీని ఉద్దేశించి మాట్లాడుతూ.. కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందని వ్యాఖ్యనించగా.. తాజాగా షోయబ్ అక్తర్ సైతం ఇదే తరహాలో మాట్లాడాడు. టీ20ప్రపంచకప్ 2022 అనంతరం విరాట్ కోహ్లీ టీ20ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అక్తర్ జోస్యం చెప్పాడు.
కోహ్లీ టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఇతర ఫార్మాట్లలో అతను సుదీర్ఘకాలం ఆడేందుకు అతను టీ20లకు వీడ్కోలు చెప్పవచ్చు. నేనే గనుక విరాటైతే.. టీ20లకు వీడ్కోలు చెప్పి.. వన్డేలు, టెస్టుల మీద మరింత ఫోకస్ పెట్టి ఉండేవాడిని' అని అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా.. అక్తర్ వ్యాఖ్యలపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
2021 ప్రపంచకప్ అనంతరం విరాట్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అనంతరం వన్డే, టెస్టుల్లో కూడా కెప్టెన్సీని వదిలివేశాడు. దీంతో బీసీసీఐ రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమించింది.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. టీ20 ఆరంభ ప్రపంచ కప్(2007)ను గెలిచిన టీమ్ఇండియా ఇంత వరకు మరోసారి కప్‌ను సొంతం చేసుకోలేదు. ఆస్ట్రేలియాలో విజయం సాధించి మరోసారి పొట్టి కప్పు కైవసం చేసుకోవాలని టీమ్ఇండియా పట్టుదలగా ఉంది. ఇప్పటికే వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్టును సెలక్టర్లు ప్రకటించారు
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
స్టాండ్ బై ఆటగాళ్లు : మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్.