నేను సహాయం చేస్తానన్న వినలేదు.. నా కిట్ నేనే మోసుకెళ్తాను అన్నాడు.. కోహ్లీ అంకితభావం గురించి కోచ్ చెప్పిన మాటలు వింటే..
ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరిగే రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌ను ప్రసారం చేసే ఆలోచనలు లేవు,
By Medi Samrat Published on 30 Jan 2025 7:56 AM IST
ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరిగే రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌ను ప్రసారం చేసే ఆలోచనలు లేవు, అయితే విరాట్ కోహ్లీ పాల్గొనడం ధృవీకరించబడిన వెంటనే.. ఈ మ్యాచ్‌ను టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయాలని నిర్ణయించారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరగనున్న ఈ మ్యాచ్‌పై ప్రేక్షకులు, అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. బుధవారం సాయంత్రం వరకు, కెమెరా సిబ్బంది స్టేడియంలో ప్రసార సెటప్ కోసం సన్నాహాలు పూర్తి చేశారు. కోహ్లీ రాకతో జట్టు ఆటతీరు మెరుగవుతుందని అంచనా. రంజీ ట్రోఫీ తొలి దశలో పేలవ ప్రదర్శన చేసిన ఢిల్లీ జట్టు.. ఇప్పుడు కోహ్లి నాయకత్వంలో రైల్వేస్‌పై విజయాన్ని నమోదు చేసేందుకు సిద్ధమైంది. ప్రేక్షకుల రాకను దృష్టిలో ఉంచుకుని DDCA ఉచిత తాగునీరు ఏర్పాట్లు చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు నార్త్, ఓల్డ్ క్లబ్ హౌస్ స్టాండ్‌లను తెరవాలని నిర్ణయించింది. రద్దీ పెరుగుతే గేట్ నంబర్ 16, బహుశా గేట్ నంబర్ 6 కూడా తెరుస్తారు.
మంగళవారం ఢిల్లీ ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ హైలైట్‌గా నిలిచాడు. బుధవారం కూడా అతని ఉనికి అందరి దృష్టిని ఆకర్షించింది. నిన్న అతడు ఉదయం 8:00 గంటలకు స్టేడియంకు చేరుకున్నాడు. జిమ్ సెషన్‌తో తన దినచర్యను ప్రారంభించాడు. దీని తర్వాత వారు 15 నిమిషాల పాటు స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. ఇందులో ఢిల్లీ ప్రధాన కోచ్ శరందీప్ సింగ్ కూడా పాల్గొన్నారు. నెట్స్ వద్ద ప్రాక్టీస్ చేయడానికి ముందు, కోహ్లీ స్టిక్కర్లు లేకుండా సాపేక్షంగా సన్నని బ్యాట్‌తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడు 16 గజాల దూరం నుండి వేసిన త్రోడౌన్ బంతులను ఎదుర్కొంటూ తన బ్యాటింగ్ ప్రారంభించాడు.
నెట్స్‌లో ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ ఫాస్ట్ బౌలర్లు నవదీప్ సైనీ, మణి గ్రేవాల్, సిద్ధాంత్ శర్మ, రాహుల్ గెహ్లాట్‌ల బంతులను ఎదుర్కొన్నాడు. కోహ్లీ ఎక్కువగా ఫ్రంట్ ఫుట్ షాట్‌లు ఆడాడు. బౌలర్లు ఆఫ్-స్టంప్ వెలుపల బంతులు వేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కొన్ని సందర్భాల్లో కోహ్లీ.. సిద్ధాంత్ శర్మ, మణి గ్రేవాల్‌ల బంతులను ఎదుర్కొనేటప్పుడు అసౌకర్యంగా కనిపించాడు. దీని తర్వాత అతడు స్పిన్నర్లు హర్ష్ త్యాగి, సుమిత్ మాథుర్, శివమ్ శర్మల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశాడు. మొదట్లో అతను బ్యాక్ ఫుట్ మీద ఆడుతూ కనిపించాడు. కానీ తర్వాత అతను ఫ్రంట్ ఫుట్ మీద వచ్చి హై షాట్లు కూడా కొట్టాడు.
ఢిల్లీ జట్టు మేనేజర్, విరాట్ కోహ్లి అండర్ -17, అండర్ -19 కోచ్ మహేష్ భాటి.. కోహ్లీ కృషి, అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ.. విరాట్ కోహ్లీ ఎప్పుడూ పెద్ద కిట్ బ్యాగ్‌ని తీసుకువెళతాడు. చాలా సార్లు యువ ఆటగాళ్ళు కిట్ బ్యాగ్‌ని మోసే విషయమై అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.. కానీ అతను తిరస్కరించాడు. ఒకరోజు నేను 'విరాట్, నన్ను మీకు సహాయం చేయనివ్వండి' అని చెప్పాను. దానికి విరాట్ బదులిస్తూ.. 'సోదరా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇది నా ఆట వస్తువులు.. నేనే ఎత్తుకుని తీసుకెళ్తాను అని చెప్పాడట.. అది ఆటపట్ల కోహ్లీ అంకితభావాన్ని తెలియజేస్తుందని చెప్పాడు.
ఉదయం 11:15 గంటలకు కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌ను ముగించాడు. భారత మాజీ క్రికెటర్ గురుశరణ్ సింగ్, DDCA అధికారులతో ఫోటోలు దిగాడు. తన అభిమానుల కోసం టీ షర్ట్‌లపై ఆటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చాడు. కోహ్లీ ప్రాక్టీస్‌ను చూసేందుకు వచ్చిన ఢిల్లీ యువ మహిళా క్రికెటర్లలో ఉత్సాహం నెలకొంది.
చాలా కాలం తర్వాత విరాట్ దేశవాళీ క్రికెట్ ఆడడం వల్ల ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారని విరాట్ కోహ్లి అన్నయ్య వికాస్ కోహ్లీ చెప్పాడు. ఈ మ్యాచ్‌ని చూసేందుకు కుటుంబ సభ్యులు కూడా స్టేడియానికి చేరుకుంటామని చెప్పాడు.