విరాట్ కోహ్లీ.. మైదానంలో దిగాడంటే పరుగుల వరద పారిచడం ఖాయం. ప్రత్యర్థి ఎవరైనా.. మైదానం ఏదైనా.. లెక్కచేయడు. ఇక చేధన అంటే పూనకం వచ్చేస్తుంది కోహ్లీకి. అందుకనే అభిమానులంతా ముద్దుగా పరుగుల యంత్రం అని పిలుచుకుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా తనదైన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు విరాట్. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. తొలుత ప్లేయర్‌గా ఎంటరైనా.. తరువాత కెప్టెన్‌గా దూసుకెలుతున్నాడు. కాగా.. ఐపీఎల్‌లో 6వేల పరుగులు సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లో 6 పోర్లు 3 సిక్సర్లు బాది 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ లక్ష్య ఛేదనలో భాగంగా క్రిస్ మోరిస్ వేసిన 13 ఓవర్ నాల్గో బంతిని ఫోర్ కొట్టడంతో కోహ్లి ఆరువేల ఐపీఎల్ పరుగుల మార్కును చేరాడు. ఐపీఎల్‌లో విరాట్ ఇప్పటి వరకు 196 మ్యాచులు ఆడి 38.4 సగటుతో 6021 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలతో పాటు 40 అర్థశతకాలు ఉన్నాయి. విరాట్ తరువాత స్థానంలో సురేశ్ రైనా(5448), శిఖర్ ధవన్(5,428), డేవిడ్ వార్నర్(5,384)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం విరాట్ ఉన్న ఫామ్ చూస్తుంటే.. ఈ సీజన్‌లోనే 7వేల పరుగుల మైలురాయిని అధిగమించినా ఆశ్చర్యపోనక్కలేదు.