మ్యాచ్ లో కాదు.. ఇన్‌స్టాలో సెంచరీ బాదిన కోహ్లీ

Virat Kohli becomes first cricketer to cross 100 million followers on Instagram.కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో 100 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 9:30 AM GMT
Virat Kohli

కోహ్లీ నుండి గ్రౌండ్ లో సెంచరీ చూడడం కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. అలాగని కోహ్లీ ఫామ్ లో లేడా అంటే.. హాఫ్ సెంచరీలను బాదుతున్నాడు తప్పితే సెంచరీలను కొట్టడం లేదు. దాదాపు రెండేళ్లవుతోంది కోహ్లీ నుండి సెంచరీని చూసి..! అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం సెంచరీతో దుమ్ముదులిపాడు కోహ్లీ. కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో 100 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్‌ తరఫున ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. సోమవారం నాటికి ఇన్‌స్టాలో విరాట్ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది.

భారత సెలెబ్రిటీలలో ప్రియాంక చోప్రా ఫాలోయర్ల సంఖ్య 60 మిలియన్ ‌ఉంది.. దీపికా పదుకొణె‌ని 53.3 మిలియన్‌ మంది ఫాలో అవుతున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇన్‌స్టా‌గ్రామ్‌లో 51.2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. వీరందరికంటే ముందు వరుసలో కోహ్లీ ఉన్నాడు.


100 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న మొదటి క్రికెటర్ గా కోహ్లీ చరిత్ర లిఖించగా.. ఫుట్ బాల్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో (266 మిలియన్‌), లియోనెల్‌ మెస్సీ (184 మిలియన్‌), నేమార్‌ (147 మిలియన్‌) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్‌ కోహ్లీనే కావడం విశేషం. 100 మిలియన్‌ ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి ఆసియా వ్యక్తిగా విరాట్‌ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు.


Next Story
Share it