Video : గంభీర్‌-కోహ్లీ ఇంట‌ర్వ్యూ 'ట్రైల‌ర్‌'.. న‌వ్వులు కూడా ఉన్నాయ్‌..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ఇంటర్నెట్‌లో ఓ వీడియోను షేర్ చేసి సంచలనం సృష్టించింది.

By Medi Samrat  Published on  18 Sep 2024 6:06 AM GMT
Video : గంభీర్‌-కోహ్లీ ఇంట‌ర్వ్యూ ట్రైల‌ర్‌.. న‌వ్వులు కూడా ఉన్నాయ్‌..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ఇంటర్నెట్‌లో ఓ వీడియోను షేర్ చేసి సంచలనం సృష్టించింది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఒక బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూలో కలిసి కనిపించారు. గంభీర్, కోహ్లి మధ్య గొడ‌వ‌ల‌ గురించి అందరికీ తెలిసిందే. వారి బంధంపై అభిమానులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఐపీఎల్‌లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య రెండు సార్లు గొడవ జరిగింది. గౌతమ్ గంభీర్ KKR కెప్టెన్‌గా.. విరాట్ కోహ్లీ RCB ప్లేయ‌ర్‌గా ఉన్న త‌రుణంలో ఇద్దరి మధ్య మొదటిసారి వివాదం జరిగింది. ఐపీఎల్ 2023 సమయంలో గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ సపోర్ట్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు.. ఆ స‌మ‌యంలోనూ కోహ్లీతో గొడవ పడ్డాడు. అయితే.. ఇప్పుడు వీరిద్దరి మధ్య అంతా పర్ఫెక్ట్ అయిపోయింది.

టీమిండియా కోచ్‌గా గంభీర్ ఉండ‌గా.. అతని కోచింగ్‌లో విరాట్ ఆడుతున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో కనిపించగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో కలిసి కనిపిస్తున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. బీసీసీఐ తన క్యాప్షన్‌లో.. చాలా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అని రాసింది. క్రికెట్ మనస్సులు ఎంత గొప్పగా పనిచేస్తాయో తెలుసుకోవడానికి వేచి ఉండండని పేర్కొంది.

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మొదటిసారి ఫ్రీవీలింగ్ సంభాషణలో కలిసి కనిపించారు. గంభీర్ తన కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ సంభాషణను ప్రారంభించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో కోహ్లీ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. మీ ఆస్ట్రేలియా సిరీస్ ఎంత అద్భుతంగా జరిగిందో నాకు గుర్తుంది అని గంభీర్‌ అన్నాడు. మీరు చాలా పరుగులు చేసారని కొనియాడాడు.

మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. మీరు ప్రత్యర్థితో సంభాషించేటప్పుడు.. అది మిమ్మల్ని ఆ జోన్ నుండి బయటకు తీసుకువెళుతుందని.. మిమ్మల్ని ఔట్ చేయగలదని మీరు ఎప్పుడైనా భావించారా? మిమ్మల్ని మీరు ఎలా ప్రేరేపిస్తారు.. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? అని కోహ్లీ ప్ర‌శ్నిస్తాడు.

కోహ్లి ప్రశ్నకు గంభీర్ వెంటనే సమాధానమిస్తూ.. ఈ ప్రశ్నకు నాకంటే మీరు బాగా సమాధానం చెప్పగలరు. మీ కెరీర్‌లో మీరు ఎక్కువ ఆన్-ఫీల్డ్ వాగ్వాదాలను ఎదుర్కొన్నారు. నాకంటే నీకే ఎక్కువ ఫైట్లు ఉన్నాయని గంభీర్ నవ్వుతూ చెప్పాడు. ఈ ప్రశ్నకు మీరు నాకంటే బాగా సమాధానం చెప్పగలరు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు కోహ్లి నా అభిప్రాయాలతో ఏకీభవించే వారి కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు. ఇది తప్పు అని నేను అనడం లేదు, ఎవరైనా సరే ఇదే సరైన మార్గం అని చెప్పాలని నేను కోరుకుంటున్నానని గంభీర్ అంటాడు.

Next Story