టెస్టులకు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ..ఎమోషన్ పోస్ట్
విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Knakam Karthik
టెస్టులకు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ..ఎమోషన్ పోస్ట్
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ను విరాట్ కోహ్లీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వారం రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన వార్తను క్రికెట్ అభిమానులు మర్చిపోకముందే.. విరాట్ కోహ్లీ కూడా టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా గత కొన్ని రోజులగా అతడి టెస్టు రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. సోమవారం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ ప్రకటించాడు.
ఈ మేరకు కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో కీలక పోస్ట్ చేశారు. అందులో "టెస్ట్ క్రికెట్‌లో నేను మొదటిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 సంవత్సరాలు అయ్యింది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఎలాంటి ప్రయాణంలో తీసుకెళుతుందో నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. జీవితాంతం నేను మోయాల్సిన పాఠాలను నేర్పింది. నేను ఈ ఫార్మాట్ నుండి వైదొలగుతున్నప్పుడు. ఇది సులభం కాదు - కానీ అది సరైనది గా అనిపిస్తుంది. నేను దానికి నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ తిరిగి ఇచ్చింది. నేను కృతజ్ఞత తో నిండిన హృదయంతో వెళ్తున్నాను. నేను ఎల్లప్పుడూ నా టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటాను..అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
అయితే రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న వారం రోజుల లోపే కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలకడం టీమిండియాకు భారీ షాక్ అని క్రికెట్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితమే విరాట్ కోహ్లీ తన రిటైర్‌మెంట్ గురించి బీసీసీఐకి చెప్పగా.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ అధికారులు కోరుతూ వచ్చినట్లు సమాచారం. కానీ చివరకు విరాట్ కోహ్లీ ఎట్టకేలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. 14 ఏళ్ల పాటు భారత్ తరఫున టెస్టులకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. 2011లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో ఆయన అరంగేట్రం చేశారు. కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడారు.