2022 టీ20 ప్రపంచకప్ వేదికల ఖరారు
Venues Confirmed for 2022 T20 World Cup.అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను
By తోట వంశీ కుమార్ Published on 16 Nov 2021 7:02 AM GMTఅండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2021ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా అతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి ఈ టోర్ని 2020లోనే ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా 2022కి వాయిదా పడింది. 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 మధ్య ఈ టోర్ని జరగనుంది. తాజాగా ఆయా మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను ఖరారు చేశారు. మొత్తం ఏడు నగరాల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఆడిలైడ్, బ్రిస్బేన్, గీలాండ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ వేదికల్లో మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మొత్తం 12 జట్లు పొట్టి ప్రపంచకప్ కోసం పోరాడనున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు నేరుగా సూపర్-12లో అడుగుపెట్టాగా.. టీ20 ర్యాంక్సింగ్ లో టాప్ 8 ర్యాంక్‌ల్లో నిలిచిన జట్లు కూడా నేరుగా సూపర్-12లో ఆడనున్నాయి. ఇందులో టీమ్ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. ఇక శ్రీలంక, వెస్టిండీస్ జట్లు మాత్రం మిగతా జట్లతో అర్హత పోటీల్లో పాల్గొని అందులో విజయం సాధిస్తేనే సూపర్-12కి చేరుకుంటాయి. ఈ అర్హత టోర్నీలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో ఒమన్‌లో ఓ టోర్నీ ఆ తరువాత జూన్‌లో జింబాబ్వేలో మరో టోర్నీ జరగనుంది. ఈ అర్హత టోర్నీ ద్వారా నాలుగు జట్లకు ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తారు.