మెడకు బంతి తగలడంతో నొప్పితో విలవిలలాడిన వెంకటేశ్ అయ్యర్
Venkatesh Iyer Fine After Being Hit On The Neck On a Wild Throw.వెంకటేశ్ అయ్యర్ మెడకు బంతి బలంగా తాకింది.
By తోట వంశీ కుమార్ Published on 17 Sep 2022 3:21 AM GMTటీమ్ఇండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ మెడకు బంతి బలంగా తాకింది. దీంతో అతడు మైదానంలో నొప్పితో విలవిల లాడిపోయాడు. ఫిజియో వచ్చి అయ్యర్‌ను పరీక్షించాడు. కాసేపటికి అయ్యర్ తేరుకుని మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లాడు. అంబులెన్స్ మైదానంలోకి రావడంతో అక్కడ ఏం జరుగుతుందనేది కాసేపు అభిమానులకు అర్థం కాలేదు. ఈ ఘటన దులీఫ్ ట్రోఫిలో జరిగింది.
కోయంబత్తూర్ వేదికగా వెస్ట్‌జోన్, సెంట్రల్ జోన్ ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటి తరువాత బ్యాటింగ్ కు వచ్చిన వెంకటేష్ అయ్యర్.. చింతన్ గజా బౌలింగ్‌లో సిక్సర్‌తో ఖాతా తెరిచాడు. ఆ తరువాతి బంతిని డిఫెన్స్ ఆడగా.. బంతి చింతన్ గజా వద్దకు వెళ్లింది. అంతకముందు బంతి సిక్స్‌గా వెళ్లడంతో ఫ్రస్టేషన్‌లో ఉన్న గజా వెంటనే బంతిని అందుకుని వికెట్ల వైపుకు విసిరాడు. అది నేరుగా వెంకటేశ్ అయ్యర్ మెడకు తాకింది.
నొప్పితో విలవిలలాడుతూ అయ్యర్ మైదానంలో కుప్పకూలాడు. వెంటనే ఫిజియో వచ్చి అతడికి పరీక్షించాడు. ముందు జాగ్రత్తగా అంబున్స్, స్ట్రెచర్ ను కూడా తెప్పించారు. కాసేపటి తరువాత తేరుకున్న అయ్యర్.. రిటైర్ హర్ట్‌గా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. జట్టు కష్టాల్లో ఉండడంతో నొప్పిని భరిస్తూ మళ్లీ బ్యాటింగ్ కు వచ్చాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటైయ్యాడు. అతడు చేసిన పరుగులు మొత్తం బౌండరీల(రెండు ఫోర్లు, సిక్స్) ద్వారా వచ్చినవే కావడం గమనార్హం.
మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసింది. అనంతరం సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్ట్‌జోన్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 130/3తో ఉంది.