వంద‌న హ్యాట్రిక్ గోల్స్.. భారత మహిళల హాకీ జట్టు విజయం.. ఆశ‌ల‌న్నీ బ్రిట‌న్‌పైనే

Vandana Katariya hat-trick keeps India alive in quarterfinal race.టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళల హాకీ జ‌ట్టు మ‌రో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2021 12:32 PM IST
వంద‌న హ్యాట్రిక్ గోల్స్.. భారత మహిళల హాకీ జట్టు విజయం.. ఆశ‌ల‌న్నీ బ్రిట‌న్‌పైనే

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళల హాకీ జ‌ట్టు మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గ్రూప్‌-ఏలో చివ‌రి మ్యాచ్ గెలిచి క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ పై ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. శ‌నివారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్లో భార‌త్ 4-3తో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో ఇండియ‌న్ ప్లేయ‌ర్ వంద‌నా క‌టారియా హ్యాట్రిక్ గోల్స్ చేసింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ కొట్టిన తొలి భార‌త క్రీడాకారిణిగా వంద‌న రికార్డు క్రియేట్ చేసింది. ఆమె 4,17,49 నిమిషాల్లో గోల్స్ సాధించింది.

భార‌త జ‌ట్టు తుది మ్యాచ్‌ను గెలిచినా.. క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం బ్రిట‌న్‌, ఐర్లాండ్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌పై ఆధార‌ప‌డి ఉంది. గ్రూప్ ఏలో ఇండియా ఆరు పాయింట్ల‌తో నాలుగ‌వ స్థానంలో నిలిచింది. నెద‌ర్లాండ్స్ 12, జ‌ర్మ‌నీ 12, బ్రిట‌న్ 6 పాయింట్ల‌తో త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక ఐర్లాండ్ 3 పాయింట్ల‌తో ఉంది. శ‌నివారం సాయంత్రం జ‌రిగే బ్రిట‌న్, ఐర్లాండ్ మ్యాచ్‌లో బ్రిట‌న్ గెలిచినా లేదా మ్యాచ్ డ్రాగా ముగిసినా కూడా భార‌త్ త‌రువాతి ద‌శ‌కు వెలుతుంది. ఒకవేళ ఐర్లాండ్‌ గెలిస్తే మాత్రం భారత మహిళల జట్టు ఇంటిముఖం పడుతుంది.

ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళ‌ల హాకి జ‌ట్టు ఓట‌ములో మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో ఓట‌మిపాలై ఒలింపిక్స్ రేసులో వెనుకబ‌డింది. దీంతో చివ‌రి రెండు మ్యాచుల్లో త‌ప్ప‌క గెలవాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శుక్ర‌వారం ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచులో 1-0 తో గెలిచిన భార‌త్‌.. శ‌నివారం ద‌క్షిణాఫ్రికాపై 4-3తో విజ‌యం సాధించింది. దీంతో క్వార్ట‌ర్స్‌పై ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది.

Next Story