పెంగ్‌ షువాయి ఆచూకీపై మ‌రింత పెరిగిన ఆందోళ‌న‌

US Demand Proof Of Missing Chinese Tennis Star's Well-Being.చైనా టెన్నిస్ క్రీడాక‌రిణి, మాజీ డ‌బుల్స్ నంబ‌ర్‌వ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Nov 2021 12:23 PM IST
పెంగ్‌ షువాయి ఆచూకీపై మ‌రింత పెరిగిన ఆందోళ‌న‌

చైనా టెన్నిస్ క్రీడాక‌రిణి, మాజీ డ‌బుల్స్ నంబ‌ర్‌వ‌న్ ఫెంగ్ షువాయి ఇప్పుడు ఎక్క‌డుంది..? ఆమెకు ఏమైన జ‌రిగిందా..? అంటూ సోష‌ల్ మీడియాలో ఓ ఉద్య‌మం మొద‌లైంది. ప‌లువురు క్రీడాకారులు కూడా ఆమె క‌నిపించ‌డం లేదంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు ఆమె ఎక్క‌డుంది..? ఏం చేస్తుంది అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కొంది. ఆమె క్షేమంగా ఉన్న‌ట్లు కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ వాటిని ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. 35 ఏళ్ల పెంగ్ షువాయి 2010 ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్‌లో, ఉమెన్ సింగిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. డబుల్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. అలాగే 2014లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్‌, 2013లో వింబుల్డన్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది.

చైనాకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్న‌తాధికారి.. త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడంటూ కొద్ది రోజుల క్రితం(న‌వంబ‌ర్ 2న‌) పెంగ్ తీవ్ర‌ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆరోప‌ణ‌లు చేసిన కొన్ని గంట‌ల త‌రువాత నుంచి పెంగ్ క‌నిపించ‌కుండా పోయింది. చైనా ప్ర‌భుత్వంలోని కొందరు పెద్దలే, పెంగ్ షువాయిని కిడ్నాప్ చేయించి ఉంటారని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో పెంగ్ ఎక్క‌డ‌..? అంటూ సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెంగ్ క్షేమంగా ఉందా..? ఉంటే ఎక్క‌డుంది అనేది చెప్పాలంటూ చైనా పై అంత‌ర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి నెల‌కొంది. అయిన‌ప్ప‌టికి చైనా ప్ర‌భుత్వం మాత్రం నోరు విప్ప‌డం లేదు.

ఈ నేపథ్యంలోనే.. చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ఎడిటర్‌ హు జియాన్‌ స్పందిస్తూ.. షువాయికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేశాడు. 'ఇంట్లోనే ఆమె కుటుంబ సభ్యులతో ఉంది. నాకున్న వనరుల ద్వారా ఆమె ఎక్కడుందో తెలుసుకున్నా. ఆమె స్వేచ్ఛగా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంది. షువాయి త్వరలోనే జనంలోకి వస్తుంది. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది కూడా' అని తెలిపాడు.

అయితే.. బ‌య‌ట ఇంతలా ఉద్య‌మం న‌డుస్తుంటే ఆమె సొంతంగా ఎందుకు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అధికార పార్టీకి చెందిన మీడియాలోనే ఆమె గురించి ఎందుకు వ‌స్తుంద‌నే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. పెంగ్ క్షేమంగా ఉన్న‌ట్లు సాక్ష్యాలు చూపించాల‌ని యూఎస్ ప్ర‌భుత్వం కోరుకుంటోంద‌ని వైట్ హౌజ్‌ మీడియా కార్య‌ద‌ర్శి జెన్ సాకి పేర్కొన్నారు. ఇక పెంగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై పార‌ద‌ర్శ‌క విచార‌ణ జ‌ర‌గాల‌ని ఐక్య‌రాజ్య స‌మితి డిమాండ్ చేసింది. మ‌రోవైపు ఆమె సుర‌క్షితంగా ఉంద‌ని తెలియ‌పోతే చైనాతో ఒప్పందం ర‌ద్దు చేసుకుంటామ‌ని.. అక్క‌డ టోర్నీలు నిర్వ‌హించ‌బోమ‌ని డబ్ల్యూటీఏ చైర్మ‌న్ సిమ‌న్స్ హెచ్చ‌రించారు. మ‌రో రెండున్న‌ర నెల‌ల్లో శీతాకాల ఒలింపిక్స్‌కు చైనా అతిథ్య‌మివ్వ‌నున్న నేప‌థ్యంలో పెంగ్ ఆచూకీ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Next Story