టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఉమేష్ తండ్రి తిలక్ యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో రెండు రోజుల తరువాత మిలన్ చౌక్ ఖపర్ఖెడాలోని అతడి ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 6.30గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా జిల్లాకు చెందిన తిలక్ కు బొగ్గు గనిలో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆయన నాగ్‌పూర్‌కు వలస వచ్చాడు. తిలక్ కు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు సంతానం.
రెజ్లింగ్ అంటే తిలక్ యాదవ్‌కు చాలా ఇష్టం. తన కుమారుడు ఉమేష్‌ను పోలీసు లేదా ఆర్మీలో చేరాలని బావించాడు. అయితే.. ఉమేష్ మాత్రం రంజీ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే తన ప్రతిభతో టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టులో ఉమేష్ యాదవ్ అరంగ్రేటం చేశాడు. దీంతో విదర్భ తరఫున టెస్టులు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.