2 సార్లు ఛాంపియ‌న్‌కు భారీ షాక్‌.. ఇంటిదారి పట్టిన వెస్టిండీస్‌.. సూప‌ర్‌-12లోకి ఐర్లాండ్‌

Two Time Champions West Indies Knocked Out With 9-Wicket Loss To Ireland.ప‌సికూన ఐర్లాండ్ జ‌ట్టు అద్భుతం చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2022 9:31 AM GMT
2 సార్లు ఛాంపియ‌న్‌కు భారీ షాక్‌.. ఇంటిదారి పట్టిన వెస్టిండీస్‌.. సూప‌ర్‌-12లోకి ఐర్లాండ్‌

ప‌సికూన ఐర్లాండ్ జ‌ట్టు అద్భుతం చేసింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను రెండు సార్లు ముద్దాడిన వెస్టిండీస్ జ‌ట్టుకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. కీల‌క‌మైన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచి సూప‌ర్‌-12కి అర్హ‌త సాధించింది. కాగా..ఈ ఓట‌మితో వెస్టిండీస్ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 నుంచి నిష్క్ర‌మించింది.

నికోల‌స్ పూర‌న్ నేతృత్వంలోని వెస్టిండీస్ జ‌ట్టు ఐర్లాండ్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగులు చేసింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ 48 బంతుల్లో ఒక సిక్స్, 6 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చార్లెస్ 24, ఒడియన్ స్మిత్ 19 పరుగులు చేశారు. కెప్టెన్ నికోల‌స్ పూర‌న్ కేవ‌లం 13 ప‌రుగులు మాత్ర‌మే చేసి తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలానీ మూడు, వికెట్లు పడగొట్టగా.. సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ చెరో వికెట్ తీశారు.

అనంత‌రం 147 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ సునాయాస‌నంగా విజ‌యాన్ని అందుకుంది. కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి 17.3 ఓవ‌ర్ల‌లోనే గెలిచింది. ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు పాల్ స్టిర్లింగ్‌(66 నాటౌట్‌), ఆండ్రూ బాల్చిర్నీ(37) పోటాపోటిగా బౌండ‌రీలు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. వీరిద్ద‌రు ధాటిగా ఆడ‌డంతో కేవ‌లం 7.3 ఓవ‌ర్ల‌లో 73 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బార్బిర్నీ ఔటైన‌ప్ప‌టికి.. లొర్కాన్ ట‌క్క‌ర్‌(45 నాటౌట్‌)తో క‌లిసి స్టిర్లింగ్ ఐర్లాండ్‌ను గెలిపించాడు. ఈ ఓట‌మితో రెండు సార్లు టైటిల్ ను సాధించిన వెస్టిండీస్ ఈ సారి మాత్రం క్వాలిఫ‌యిర్ రౌండ్‌లోనే ఇంటి ముఖం ప‌ట్టింది.

Next Story