రోహిత్ అద్భుత శతకం.. మెరిసిన పుజారా
Ton up Rohit Sharma Shines as India Take 171 Runs Lead at Stumps.హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో
By తోట వంశీ కుమార్ Published on 5 Sep 2021 2:53 AM GMTహిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ఆటగాడు. అయితే.. టెస్టుల్లో మాత్రం అతడి స్థానం ఎప్పుడూ ప్రశ్నార్థకమే. అది అంతా గతం. ఎప్పుడైతే.. టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా రావడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి సరికొత్త రోహిత్ శర్మను చూపిస్తున్నాడు. ప్రతి బంతిని బాదడం కాకుండా.. పరిస్థితులకు తగ్గట్లు తనను తాను అన్వయించుకుంటూ జట్టుకు చక్కటి శుభారంభాలను ఇస్తున్నాడు. స్వదేశంలో ఓకే మరీ.. విదేశాల్లో రోహిత్ రాణిస్తాడా..? అని చాలా మంది విమర్శలు చేశారు. అన్నింటికి తన బ్యాట్‌తోనే చక్కని సమాధానం ఇచ్చాడు. అందుకు ఈ సిరీసే ఉదాహారణ. ప్రతి మ్యాచ్‌లో చాలా సహానంతో బ్యాటింగ్ చేశాడు. అందుకు తగ్గ ప్రతిఫలం శతకం రూపంలో నిన్న దొరికింది. రోహిత్ కెరీర్‌లోనే అద్భుత శతకం అది.
రోహిత్ శర్మ (256 బంతుల్లో 127; 14 ఫోర్లు, ఒక సిక్సర్) శతకంతో విజృంభిస్తే.. నయావాల్ పుజారా(127 బంతుల్లో 61; 9 ఫోర్లు), రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో నాలుగో టెస్టు మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 270 పరుగులతో నిలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(22), రవీంద్ర జడేజా (9) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో రోజు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి. ప్రస్తుతం ఒత్తిడి అంతా ఇంగ్లండ్ పైనే ఉంది.
అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 43/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఇంగ్లండ్ పేస్ త్రయం అండర్సన్, రాబిన్సన్, వోక్స్‌లను రోహిత్, రాహుల్‌ల ధ్వయం సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వాతావరణం బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో ఎంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. అండర్సన్ బౌలింగ్‌లో రాహుల్ ఔట్ కాగా.. పుజారాతో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఇక పుజారా కూడా ఢిఫెన్స్‌ను వదిలేసి వేగంగా పరుగులు చేశాడు. స్క్వేర్ కట్, లేట్ కట్‌లతో అలరించాడు. ఇటు రోహిత్ శర్మ కూడా సాధికారంగా బ్యాటింగ్ చేశాడు. 145 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు రోహిత్. అర్థశతకం తరువాత కాస్త వేగం పెంచిన రోహిత్ మొయిన్ అలీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో తనదైన శైలిలో శతకాన్ని అందుకున్నాడు. కాసేపటికే పుజారా కూడా హాఫ్‌సెంచరీ చేశాడు. భారత్ చాలా పటిస్ఠ స్థితిలో నిలిచింది. వీరిద్దరే రోజును ముగించేలా కనిపించారు. అయితే.. ఇంగ్లండ్ కొత్త బంతితో దెబ్బ తీసింది. కొత్త బంతితో తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఔట్ కాగా.. చివరి బంతికి పుజారా పెవిలియన్ చేరాడు. వీరిద్దరని రాబిన్‌స్సన్ ఔట్ చేశాడు. రోహిత్, పుజారా రెండో వికెట్‌కు153 పరుగులు జోడించారు. ఇక కెప్టెన్ కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా మూడో రోజును ముగించారు. ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ మరో 7 వికెట్లు చేతిలో ఉండడంతో ఎన్ని పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.