ప్రేక్షకులు లేని ఒలింపిక్స్‌కు టార్చ్‌ రిలే ప్రారంభం

Tokyo Olympics 2021. టోక్యో ఒలింపిక్స్ కు నాందిగా ‌ టార్చ్‌ రిలేగురువారం ప్రారంభమైంది.

By Medi Samrat  Published on  26 March 2021 10:28 AM IST
Tokyo Olympics 2021

మొత్తానికి అనుకున్నట్టు గానే ప్రేక్షకులెవరూ లేకుండా జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కు నాందిగా ‌ టార్చ్‌ రిలేగురువారం ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఒక ఏడాది ఆలస్యంగా ఈ క్రీడలు ప్రారంభమవుతున్నాయి. జులై 23న జరగనున్న ఈ క్రీడా కార్యక్రమాలకు ప్రారంభ సూచనగా ఫుకుషిమాలోని జోవిలేజ్‌ క్రీడా సముదాయంలో రోజ్‌ గోల్డ్‌ కలర్ లో చెర్రీ బడ్ షేప్ లోని టార్చ్‌ను వెలిగించి రిలే ప్రారంభించారు.

ఒలింపిక్స్‌ క్రీడలకు టోక్యో ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు రాగానే, ఫుకుషిమా విపత్తు నుండి బయటపడడంలో దేశ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక అవకాశంగా భావించారు. 2011లో భూకంపం, సునామీ, అణు విపత్త్తుతో దెబ్బతిన్న ప్రాంతం మళ్ళీ ఏ విధంగా స్పాట్‌లైట్‌లోకి వచ్చిందో తెలియచేసేలా ఒలింపిక్స్‌ను ఇక్కడ నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా మహమ్మారి ఈ ఆలోచనలన్నింటినీ పటాపంచలు చేసింది. కరోనా భయంతో గత సారి వాయిదా పడిన ఒలంపిక్స్ ఈ సంవత్సరం నిర్వహించడానికి నిర్ణయించినప్పటినుంచి జపాన్‌లో ఇప్పటివరకు ఎన్నో సర్వేలు నిర్వహించారు.

ప్రతి సర్వేలో 80 శాతానికి పైగా జపాన్‌ వాసులు విదేశీ ప్రేక్షకులు వస్తే కరోనా మహమ్మారి వ్యాప్తి అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. అంతేకాదు... సర్వేల్లో పాల్గొన్న మెజారిటీ ప్రజలు వారితో వైరస్‌ ఎక్కడ అంటుకుంటుందోనన్న బెంగతో అసలు ఒలింపిక్సే రద్దు చేయాలని కోరారు! ఈ నేపథ్యంలోనే జపాన్‌ కేంద్ర ప్రభుత్వంతోపాటు స్థానిక ప్రభుత్వాధికారులతో ఆన్‌లైన్‌లో సమావేశమైన ఐఓసీ ప్రేక్షకులపై స్పష్టత ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌ జూలై 23 నుంచి ఆగస్టు 8 జరిగితాయని క్రీడలతో విదేశాల నుంచి వచ్చే అభిమానులకు అనుమతి లేదని ప్రకటించారు. అయితే ఇదివరకే 6 లక్షల టికెట్లను విదేశీయులకు విక్రయించారు. ఇప్పుడు వారందరికీ డబ్బులు తిరిగి చెల్లిస్తారు.

ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఈ రిలే కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు. టార్చ్‌ రిలే సందర్భంగా టోక్యో 2020 చీఫ్‌ షెకో హషిమొటో మాట్లాడుతూ, 'ఒలింపిక్‌ క్రీడా జ్యోతి చీకటి చివరిన వుండే ఆశాకిరణం వంటిదని' వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ జాగ్రత్తల కారణంగా మొదటి దశలోకూడా ప్రేక్షకులెవరూ లేకుండానే ఈ రిలే ప్రారంభించారు. టార్చ్‌ వెళుతుండగా, అభిమానులు రోడ్డు కిరువైపులా ముఖాలకు మాస్క్‌లతో నిల్చుని చప్పట్లతో తమ హర్షాతిరేకాలు తెలియచేయవచ్చు. 47 జిల్లాల వ్యాప్తంగా ప్రయాణించే ఈ టార్చ్‌ను 10వేల మంది రన్నర్లు చేబూననున్నారు. జులై 23న ప్రారంభోత్సవ కార్యక్రమానికి టోక్యో నేషనల్‌ స్టేడియానికి చేరుతుంది. రిలే కోసం నిర్వాహకులు పూర్తిగా సన్నద్ధమయ్యారు.





Next Story