కంగారూల కంచుకోట బ‌ద్ద‌లు.. భార‌త్ అద్భుత విజ‌యం.. సిరీస్ కైవ‌సం

Team India won Brisbane test.గ‌బ్బా స్టేడియం ఆస్ట్రేలియా జ‌ట్టుకు కంచుకోట లాంటి స్టేడియం అలాంటి చోట భార‌త్ అద్భుత విజ‌యం.. సిరీస్ కైవ‌సం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2021 8:15 AM GMT
Team India won the Brisbane test

గ‌బ్బా స్టేడియం ఆస్ట్రేలియా జ‌ట్టుకు కంచుకోట లాంటి స్టేడియం. ఇక్క‌డ ఆసీస్ గ‌త 32 సంవ‌త్స‌రాల్లో 31 టెస్టులు ఆడ‌గా.. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అలాంటి చోట గాయాల‌తో సత‌మ‌త‌మ‌వుతున్న టీమ్ఇండియా మ‌రుపురాని విజ‌యాన్ని అందుకుంది. కోహ్లీ, బుమ్రా, ష‌మీ, జ‌డేజా వంటి కీల‌క ఆట‌గాళ్లు దూర‌మైన‌.. శుభ్‌మ‌న్ గిల్, పంత్‌, సుంద‌ర్ వంటి యువఆట‌గాళ్లు రాణించ‌డంతో.. కంగారూలకు ఓట‌మి రుచి చూపించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవ‌సం చేసుకుంది. గ‌త‌ప‌ర్య‌ట‌న‌లో స్మిత్‌, వార్న‌ర్ లేక‌పోవ‌డం వ‌ల్లే భార‌త్ గెలిచింద‌ని చెప్పిన ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్లు మ‌రీ ఇప్పుడు ఏం అంటారో చూడాలి మ‌రీ.

ఆసీస్ నిర్దేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భార‌త్ ఏడు వికెట్లు కోల్పోయి చేదించింది. నాలుగు పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ త‌గిలింది. రోహిత్ శర్మ (7) ను ప్యాట్ కమిన్స్ ఔట్ చేశాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన‌ పుజారా(56; 211 బంతుల్లో 7 పోర్లు), మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌(91)తో ఇన్సింగ్స్‌కు బలమైన పునాదులు వేశారు. వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 114 ప‌రుగులు జోడించారు. గిల్ తృటిలో శ‌త‌కం చేజార్చుకున్నాడు. 91ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. కెప్టెన్ రహానే (24) తొంద‌ర‌గానే పెలివిలియ‌న్ బాట ప‌ట్టాడు. అప్ప‌టికే క్రీజులో పాతుకుపోయిన పుజారాకు పంత్(89; 138 బంతుల్లో 9 పోర్లు,1 సిక్స్‌) జ‌త‌క‌లిసాడు.

పుజారా డిపెన్స్‌తో ఆసీస్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌గా.. పంత్ బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డారు. వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు 61 ప‌రుగులు జోడించారు. న‌యావాల్ పుజ‌రాను క‌మిన్స్ బోల్తా కొట్టించాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్‌(9) ఇలా వ‌చ్చి అలా వెళ్లాడు. అయితే.. అరంగ్రేట ఆట‌గాడు వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(22; 29 బంతుల్లో 2 పోర్లు, 1 సిక్స్‌) తో క‌లిసి పంత్ ఆసీస్‌పై విరుచుకుప‌డ్డాడు. దీంతో ల‌క్ష్యం క‌రిగిపోయింది. చివ‌ర్లో సుంద‌ర్, శార్దుల్‌(2) ఔట్ అయినా.. పంత్ బౌండ‌రీతో విజ‌యాన్ని అందించాడు. ఈ విజ‌యంతో భార‌త్ నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవ‌సం చేసుకుంది. ప్లేయ‌ర్ ఆప్ ది మ్యాచ్ పంత్ గెల‌వ‌గా.. ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ క‌మిన్స్ అందుకున్నాడు.




Next Story