విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రోహిత్ శర్మ, ద్రావిడ్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్ లో పెద్దగా రాణించకపోవడం భారతజట్టును కలవరపెడుతూ ఉంది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 8:00 AM GMTవిరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రోహిత్ శర్మ, ద్రావిడ్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్ లో పెద్దగా రాణించకపోవడం భారతజట్టును కలవరపెడుతూ ఉంది. ఓపెనర్ గా భారత జట్టుకు వస్తున్న కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ అండగా నిలిచారు. జూన్ 27, గురువారం గయానాలో జరిగిన T20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో విరాట్ కోహ్లీ 9 పరుగులకే అవుటయ్యాడు, అయితే భారత్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. జూన్ 29, శనివారం బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే అంతిమ పోరులో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడతాడని.. అందులో సందేహం లేదని రోహిత్ శర్మ చెప్పి కోహ్లీని వెనకేసుకు వచ్చాడు. "చూడండి, అతను నాణ్యమైన ఆటగాడు. అతని క్లాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన మ్యాచ్ లలో అతని ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము. 15 సంవత్సరాలు క్రికెట్ ఆడినప్పుడు ఫామ్ ఎప్పుడూ సమస్య కాదు. మంచి ఇన్నింగ్స్ ను విరాట్ కోహ్లీ ఫైనల్ కోసం దాచాడేమో" అంటూ రోహిత్ కోహ్లీకి మద్దతిచ్చాడు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత ద్రవిడ్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ మంచి టచ్ లోనే ఉన్నాడు. ఈ రోజు కూడా, అతను టెంపోను సెట్ చేయడానికి మంచి 6 కొట్టాడు. కానీ అతన్ని దురదృష్టం వెంటాడింది.. బంతి కొంచెం ఎక్కువ సీమ్ అయింది. కానీ అతడి ఆట తీరును అభినందిస్తున్నాను. విరాట్ కోహ్లీ నుండి పెద్ద ఇన్నింగ్స్ రాబోతోందని నేను ఆశిస్తున్నాను. నేను అతని వైఖరిని ప్రేమిస్తున్నాను. అతను మైదానంలో ఎంతో కమిట్ మెంట్ తో ఆడుతున్నాడు. కోహ్లీ ఫైనల్ లో తప్పకుండా సత్తా చాటుతాడని ఆశిస్తున్నాం" అని చెప్పారు.
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఓపెనింగ్ చేసే బాధ్యతను అప్పగించినప్పటి నుండి విరాట్ కోహ్లి పెద్దగా రాణించడం లేదు. గ్రూప్ దశల్లో న్యూయార్క్ పిచ్‌లపై కష్టపడిన కోహ్లీ సూపర్ 8 దశలో మాత్రం రెండు మంచి ఆరంభాలను పొందగలిగాడు. అయితే, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో గయానాలోని కష్టతరమైన పిచ్‌పై దూకుడుగా ఆడినందుకు అతను మూల్యం చెల్లించుకున్నాడు. విరాట్ కోహ్లీ ఈ T20 ప్రపంచ కప్ లో ఏడు మ్యాచ్‌లలో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ ఫైనల్ లో తప్పకుండా సత్తా చాటుతాడని భారత క్రికెట్ జట్టు అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.