'ఆ జట్టు పోటీ ఎక్కడా?'.. పాకిస్తాన్‌ జట్టుపై సూర్యకుమార్‌ సెటైర్లు

ఆసియా కప్‌ - 2025లో భాగంగా నిన్నటి మ్యాచ్‌లో విక్టరీ తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాక్‌ జట్టుపై ఇండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెటైర్లు వేశారు.

By -  అంజి
Published on : 22 Sept 2025 8:02 AM IST

Team India, T20 captain Suryakumar Yadav, Pakistan team, Asia Cup

'ఆ జట్టు పోటీ ఎక్కడా?'.. పాకిస్తాన్‌ జట్టుపై సూర్యకుమార్‌ సెటైర్లు

ఆసియా కప్‌ - 2025లో భాగంగా నిన్నటి మ్యాచ్‌లో విక్టరీ తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాక్‌ జట్టుపై ఇండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెటైర్లు వేశారు. 'ఇరుజట్ల మధ్య పోటీ గురించి తరచూ ప్రశ్నలు అడుగుతుంటారు. 15 మ్యాచుల్లో 7-7, 8-7 తేడాతో పోటాపోటీగా గెలుస్తూ ఉంటే పోటీ గురించి మాట్లాడుకోవచ్చు. వన్‌సైడెడ్‌గా ఇండియా గెలుస్తోంది. ఇందులో ఆ జట్టు పోటీ ఎక్కడుంది' అని ప్రశ్నించారు. ఆసియా కంప్‌లో 2 మ్యాచ్‌ల్లోనూ పాక్‌ను ఇండియా ఓడించింది.

నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ 6 వికోట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (74), శుభమన్‌ గిల్‌ (47) తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కొల్పోయినప్పటికీ తిలక్‌ (30*) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కి రెండో విజయం. తర్వాతి మ్యాచ్‌ బుధవారం నాడు బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

అటు ఫైనల్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడే అవకాశం ఉంది. ఇదే జోరులో సూపర్‌ -4లో మిగతా రెండు మ్యాచ్‌లు గెలిస్తే భారత్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్‌ కన్నా పాక్‌ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్‌ చేరితే ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉంది. బిగ్‌ ఈవెంట్లలో పాక్‌పై భారత్‌ డామినేషన్‌ కొనసాగుతోంది. 2022 టీ20 వరల్డ్‌క్‌ నుంచి నిన్నటి వరకు మొత్తం 7 మ్యాచుల్లో టీమిండియా జయభేరి మోగించింది.

Next Story