సౌతాఫ్రికా టూర్‌కు ముందు కోహ్లీ కీలక నిర్ణయం!
క్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా.. భారత్ ఆతిథ్య జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 1:27 PM ISTసౌతాఫ్రికా టూర్‌కు ముందు కోహ్లీ కీలక నిర్ణయం!
వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు గెలవగా ఆస్ట్రేలియా ఒకటి గెలిచింది. మరో రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయి. అయితే.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ తర్వాత భారత జట్టు సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది. దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా.. భారత్ ఆతిథ్య జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 10న డర్బన్ వేదికగా తొలి టీ20తో భారత జట్టు ప్రోటీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ సౌతాఫ్రికా టూర్ కోసం భారత జట్టును బీసీసీఐ మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించనుంది.
ఈ క్రమంలో ఓ వార్త వైరల్ అవుతోంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సౌతాఫ్రికా టూర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రొటీస్‌తో వైట్ బాల్ సిరీస్‌లకు దూరంగా ఉండాలని విరాట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత.. స్వదేశంలో జరుగుతోన్న ఆసీస్ టీ20 సిరీస్‌కు విరాట్ దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లకు అయినా కింగ్ కోహ్లీ అందుబాటులోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం అందుకు సుముఖంగా లేడని సమాచారం అందుతోంది. అయితే.. తనకు ఇంకొంత కాలం బ్రేక్ అవసరమని.. అందుకే సౌతాఫ్రికా టూర్‌కు రాకపోవచ్చని పలువురు చెబుతున్నారు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు మాత్రం పక్కాగా విరాట్ వస్తాడని చెబుతున్నారు. దీని తర్వాత జనవరిలో స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆడనుంది.