244 పరుగులకే చేతులెత్తేసిన టీమ్ఇండియా
Team India Scored 244 Runs In First Innings. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో
By Medi Samrat Published on 18 Dec 2020 11:22 AM IST
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 93.1 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు నష్టానికి 233 పరుగులు చేసిన భారత్.. రెండో రోజు ఆట ప్రారంభమైన 23 నిమిషాల్లో 25 బంతులను ఎదుర్కొని 11 పరుగులే చేసి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆదుకుంటారు అనుకున్న వృద్దిమాన్ సాహా(9), రవిచంద్రన్ అశ్విన్ (15) నిరాశే మిగిలింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ నాలుగు, కమిన్స్ 3, లైయన్, హెజిల్‌వుడ్ చెరో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి రాణించాడు. ఓపెనర్ పృథ్వీ షా డకౌట్ కాగా, మయాంక్ అగర్వాల్ 17, పుజారా 43, రహానే 42, హనుమ విహారి 16, సాహా 9, అశ్విన్ 15 పరుగులు చేశారు.
అశ్విన్, సాహాలు క్రీజులో ఉండడంతో టీమిండియా 300 మార్కును సులభంగా దాటుందని అంతా భావించారు. కానీ పిచ్‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకున్న స్టార్క్, కమిన్స్‌లు రెచ్చిపోయారు. రెండో రోజు కమిన్స్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే రవిచంద్రన్ అశ్విన్ కీపర్ టీమ్ పైన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టెయిలెండర్ల సాయంతో కనీసం పోరాడుతాడనుకున్న సాహా సైతం తర్వాతి ఓవర్‌లోనే స్టార్ వేసిన బంతిని షాత్‌కు యత్నించి కీపర్ చేతికే చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన ఉమేశ్ యాదవ్(6), షమి(0) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. బుమ్రా 4 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.