భార‌త అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఆ ఐదుగురికి క‌రోనా నెగెటివ్‌

Team India players test negative for coronavirus.టీమ్ఇండియా అభిమానుల‌కు శుభ‌వార్త‌. భార‌త జ‌ట్టు స‌భ్యులు లో ఆ ఐదుగురికి క‌రోనా నెగెటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2021 7:03 AM GMT
Team India Cricket team

టీమ్ఇండియా అభిమానుల‌కు శుభ‌వార్త‌. భార‌త జ‌ట్టు స‌భ్యులు, స‌హాయ‌క సిబ్బంది అంద‌రికి క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అంద‌రికి నెగెటివ్ వ‌చ్చింది. టీమ్ఇండియా స‌భ్యులు ఇటీవ‌ల బ‌యోబ‌బుల్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించార‌నే వార్త దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ స‌హా ఐదుగురు క్రికెట‌ర్లు రెస్టారెంట్‌కు వెళ్ల‌డంతో వివాదం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఆర్టీ-పీసీఆర్‌ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగటివ్‌గా తేలిందని బీసీసీఐ ఒక ప్రకటలో వెల్ల‌డించింది.

పరీక్షలు చేయించుకున్నవారిలో ఐసోలేషన్‌లో ఉన్న రోహిత్‌ శర్మ, పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవదీప్‌ సైనీ ఉన్నారని వెల్లడించింది. కాగా.. పింక్‌బాల్‌ టెస్టులో విజయం అనంతరం ఈ ఐదుగురు కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వారిపై అభిమానంతో నవల్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తి చాటుగా బిల్లు చెల్లిచడం, ఆ విషయాన్ని ట్వీట్ చేయ‌డంతో వైరల్‌గా మారింది. బిల్లు కట్టిన విషయం తెలుసుకుని రోహిత్‌ శర్మ తనను వారించినట్లు, రిషభ్‌ పంత్‌ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని చెప్ప‌డంతో.. భార‌త ఆట‌గాళ్లు బ‌యోబుల్ నిబంధ‌న‌ను ఉల్లంగించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఈ ఐదుగురు ఆట‌గాళ్ల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచారు. ఆటగాళ్లు బయో బబుల్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నాయి.

ఈ నెల 7 నుంచి సిడ్నీ వేదిక‌గా భార‌త్‌-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా.. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్‌‌ బౌలర్‌ జేమ్స్‌ పాటిన్సన్‌ దూరమయ్యాడు. పక్కటెముకల గాయం కారణంగా పాటిన్సన్‌ మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట​ ఆస్ట్రేలియా తెలిపింది.


Next Story