పాక్ బౌల‌ర్‌ను ప‌రామ‌ర్శించిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు.. వీడియో వైర‌ల్‌

Team India Players meet injured Shaheen Afridi video goes viral.ఆసియా క‌ప్ 2022 టోర్నీ రేప‌టి(శ‌నివారం) నుంచి ప్రారంభం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2022 9:32 AM GMT
పాక్ బౌల‌ర్‌ను ప‌రామ‌ర్శించిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు.. వీడియో వైర‌ల్‌

ఆసియా క‌ప్ 2022 టోర్నీ రేప‌టి(శ‌నివారం) నుంచి ప్రారంభం కానుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు ఆదివారం త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల క్రీడాభిమానులే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే రెండు జ‌ట్లు దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లెట్టేశాయి. అయితే.. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో శిక్షణ సెషన్‌లలో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇటీవ‌ల పాకిస్తాన్ పేస‌ర్ షాహీన్ షా అఫ్రిది గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆసియా క‌ప్‌లో అత‌డు ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ పాక్ జ‌ట్టుతో పాటే యూఏఈకి వ‌చ్చాడు. ప్రాక్టీస్ ముగించుకున్న అనంత‌రం భార‌త ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, య‌జేంద్ర చ‌హ‌ల్‌లు షాహీన్ అఫ్రిది ని ప‌రామ‌ర్శించారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

సంభాషణ ముగింపులో పాకిస్థాన్ పేసర్ త్వరగా కోలుకోవాలని కోహ్లీ విష్ చేయ‌గా.. పాకిస్థాన్ తరఫున నీ బ్యాటింగ్ మిస్సవుతున్నాం అంటూ రిషబ్ పంత్‌ సరదాగా అన్నాడు. దీంతో ఇద్ద‌రూ కాసేపు న‌వ్వు కున్నారు. అఫ్రిది పేస్ బౌల‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ వీడియోలో క్రికెట‌ర్ల మ‌ధ్య ఉన్న ప‌ర‌స్ప‌ర సంబాష‌ణ‌ల‌ను చూసి కొంద‌రు నెటీజ‌న్లు ప్ర‌శంశిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గ‌తేడాది టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్‌ను పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఆదివారం జ‌రిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని స‌గ‌టు భార‌త అభిమాని ఆశిస్తున్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ క‌రోనా బారిన ప‌డ‌డంతో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు.

Next Story
Share it