జింబాబ్వేపై భారత్ భారీ గెలుపు.. పాక్, ఆసీస్‌ రికార్డు బద్దలు

టీమిండియా యంగ్ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సెంచరీతో చితక్కొట్టాడు.

By Srikanth Gundamalla  Published on  8 July 2024 1:52 AM GMT
team india, new record,   cricket ,

 జింబాబ్వేపై భారత్ భారీ గెలుపు.. పాక్, ఆసీస్‌ రికార్డు బద్దలు 

జింబాబ్వేతో టీ20 సిరీస్‌ ఆడుతోన్న భారత్‌ తొలి మ్యాచ్‌లో ఓటమిని చూసింది. ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. ఏకంగా వంద పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టీమిండియా యంగ్ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సెంచరీతో చితక్కొట్టాడు. ఈ క్రమంలోనే ఇండియా అరుదైన రికార్డును అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్ల పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది.

వంద పరుగులకు పైగా తేడాతో అత్యధికసార్లు విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా రికార్డును నెలకొల్పింది. జింబాబ్వేపై గెలుపుతో మొత్తం 5 సార్లు వంద పరుగుల తేడాతో విజయాలు అందుకున్న టీమ్‌గా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో చెరో నాలుగు సార్లు ఈ ఫీట్‌ సాధించిన టీమ్‌లుగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. ఇంగ్లండ్, అప్ఘాన్‌ చెరో మూడు సార్లు వందకు పైగా పరుగులతో విజయాన్ని అందుకున్నాయి.

టీ20లలో అత్యధిక సార్లు వందకుపైగా పరుగుల తేడాతో గెలిచిన టీమ్‌లు

* భారత్: 5 విజయాలు

* పాకిస్థాన్ : 4 విజయాలు

* ఆస్ట్రేలియా : 4 విజయాలు

* ఇంగ్లండ్: 3 విజయాలు

* ఆఫ్ఘనిస్థాన్ : 3 విజయాలు

భారత్ గతేడాది అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై ఏకంగా 168 పరుగుల తేడాతో గెలిచింది. టీ20లలో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. ఆ తర్వాత ఐర్లాండ్‌పై 143 పరుగులు, దక్షిణాఫ్రికాపై 106 పరుగులు, ఆఫ్ఘనిస్థాన్‌పై 101 పరుగులు, తాజాగా జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో ఘన విజయాలు సాధించింది.

Next Story