బ్రిస్బేన్ వేదిగా భారత్ ,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో అతిథ్య ఆసీస్ 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 33 పరుగులు కలుపుకుని టీమ్ఇండియా ముందు 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో స్టీవ్ స్మిత్ 55 పరుగులతో రాణించగా.. భారత బౌలర్లలో సిరాజ్ 5 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో సత్తా చాటారు.
అంతకముందు 21/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్‌కు ఆ జట్టు ఓపెనర్లు వార్నర్(48), హ్యారిస్(38) తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే.. పుంజుకున్న బౌలర్లు వీరిద్దరి స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చారు. హ్యారిస్‌ను శార్దుల్, వార్నర్‌ను సుందర్ ఔట్ చేశారు. ఆ తరువాత లబుషేన్(25), స్టీవ్ స్మిత్ వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ దశలో సిరాజ్ ఆసీస్‌కు షాకిచ్చాడు. ఒకే ఓవర్‌లో లబుషేన్, మాథ్యూ వేడ్(0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత వచ్చిన గ్రీన్(37), కెప్టెన్ పైన్(27), ప్యాట్ కమిన్(28 నాటౌట్) తలా ఓ చేయి వేయడంతో.. ఆసీస్ భారీ స్కోర్ సాధించింది. సిరాజ్ తన టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
అనంతరం 328 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగింది టీమ్ ఇండియా. రెండు ఓవర్లు ముగియకుండానే వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. రోహిత్ శర్మ (4), శుభ్‌మన గిల్ (0) క్రీజులో ఉన్నారు.