నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. సిడ్ని వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా చివరి రోజు ఇంకా 309 పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా విజయకేతనం ఎగురవేయాంటే.. ఆ జట్టు మరో ఎనిమిది వికెట్లు తీస్తే చాలు. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(9), రహానే (4) ఉన్నారు.
అంతముందు ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ(52), శుభ్‌మన్ గిల్ (31) తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని హెజిల్‌వుడ్ విడగొట్టాడు. 31 పరుగులు చేసిన గిల్‌ను హెజిల్‌వుడ్ బోల్తా కొట్టించాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో అండతో రోహిత్ తన దైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. విదేశాల్లో ఓపెనర్‌గా తొలి అర్థశతకం నమోదు చేశాడు. తర్వాతి ఓవర్‌లోనే కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద స్టార్క్ చేతికి చిక్కాడు. అనంతరం కెప్టెన్ రహానే, పుజారా మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే.. 8 వికెట్లు కావాల్సి ఉండగా.. భారత్ గెలవాంటే ఇంకా 309 పరుగులు కావాలి. ఒకవేళ రోజంతా భారత బ్యాట్స్‌మెన్లు నిలిస్తే మ్యాచ్ డ్రా అవుతుంది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్‌కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 312/6 వద్ద డిక్లేర్ చేయగా.. భారత్ ముందు 407 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.