టీమిండియాకు కొత్త కోచ్‌ ఖాయమే..! ఎప్పుడొస్తాడు..?

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  10 May 2024 10:10 AM GMT
team india, head coach,  cricket, rahul dravid ,

టీమిండియాకు కొత్త కోచ్‌ ఖాయమే..! ఎప్పుడొస్తాడు..?

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన మాజీ అయిపోతారని సమాచారం. ఆయన స్థానంలో కొత్త కోచ్‌ను తీసుకునేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీ తర్వాత దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ ముమ్మరం చేయనుందని సమాచారం. ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్‌ కప్‌2024 టోర్నీ మొదలు కాబోతుంది. ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకే అంటే జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ ఆరంభం అవనుంది.

టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనుంది. ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌ షెడ్యూల్‌ను ఫిక్స్‌ చేశారు. తొలి సగం మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో.. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్‌లు అమెరికాలో కొనసాగనున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఆడబోయే ఫ్రాంఛైజీల ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన క్రికెటర్లు ఈ నెల 24వ తేదీన వెస్టిండీస్‌కు బయలుదేరే అవకాశం ఉంది.

అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్‌ రావడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. మెగా టోర్నీ ముగిసిన తర్వాత కోచ్‌ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ చేపట్టనుంది. కొత్త కోచ్‌ కోసం త్వరలోనే బీసీసీఐ దరఖాస్తులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ను జారీ చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జైషా ధృవీకరించారు. హెడ్‌ కోచ్‌గా రాహుల్ డ్రావిడ్ పదవీకాలం జూన్‌ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత కొత్త కోచ్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. ఒకవేళ రాహుల్‌ ద్రావిడ్‌కు ఆసక్తి ఉంటే ఆయన కూడా దరఖాస్తు చేసుకోవచ్చని జైషా అన్నారు.

Next Story